Share News

రఘురామ టార్చర్‌ కేసులో.. సునీల్‌ నాయక్‌ను కస్టడీలో విచారించాలి

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:42 AM

ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌, నాటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురించేసిన గదిలో ఐపీఎస్‌ సునీల్‌ కుమార్‌ నాయక్‌(ఏ-7)తో పాటు...

రఘురామ టార్చర్‌ కేసులో.. సునీల్‌ నాయక్‌ను కస్టడీలో విచారించాలి

  • ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంటు ఇవ్వండి

  • గుంటూరు కోర్టులో పోలీసుల పిటిషన్‌.. నేడు తీర్పు

గుంటూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌, నాటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురించేసిన గదిలో ఐపీఎస్‌ సునీల్‌ కుమార్‌ నాయక్‌(ఏ-7)తో పాటు సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నాలుగో నిందితుడైన విజయ్‌పాల్‌ విచారణకు సహకరించలేదని.. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే సునీల్‌ నాయక్‌ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేయాలని గుంటూరులోని మొబైల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ప్రాసిక్యూషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వీరగంధం రాజేంద్రప్రసాద్‌ కోర్టులో వాదనలు వినిపించారు. సునీల్‌ నాయక్‌ను సోమవారం పట్నాలో అరెస్టు చేసిన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను మేజిస్ట్రేట్‌కు వివరించారు. కేసులో విచారణకు రావాలంటూ ఇప్పటికి రెండుసార్లు నోటీసులు పంపినప్పటికీ నాయక్‌ నుంచి స్పందన లేదన్నారు. సునీల్‌ నాయక్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ చేయడంతో పాటు పట్నాలో ఆయనను అరెస్టు చేసే క్రమంలో ఏపీ పోలీసులకు సహకరించాలంటూ బిహార్‌ సీఎస్‌, డీజీపీ, హోం కార్యదర్శి, సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యవహారంలో బుధవారం తగు ఆదేశాలు ఇస్తానని న్యాయాధికారి స్రవంతి ప్రకటించారు.

Updated Date - Feb 25 , 2026 | 04:46 AM