సునీల్ అరెస్టు తథ్యం
ABN , Publish Date - Mar 01 , 2026 | 06:29 AM
సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్.. చట్టం తనకు వర్తించదన్న భ్రమలో ఉన్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.
అధికార మదంతోనే వ్యాఖ్యలు..
న్యాయవ్యవస్థను అవమానించడమే
కులం ముసుగులో తప్పించుకోలేరు: రఘురామ
భీమవరం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్.. చట్టం తనకు వర్తించదన్న భ్రమలో ఉన్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘జగన్ హయాంలో అప్పటి నర్సాపురం ఎంపీగా ఉన్న నాపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చట్టం తనకు వర్తించదన్న భ్రమలో ఉన్నారనడానికి నిదర్శనం. ఒక నిందితుడు మీడియా ముందుకు వచ్చి ‘నిజంగా కొట్టి ఉంటే ఎన్ని ఎముకలు విరిగేవి’ అని మాట్లాడడం ఽధైర్యం కాదు. దురహంకారం. అధికార మదం ఇంకా సునీల్‌కుమార్ తలకెక్కే ఉంది. ఇది కేవలం వ్యంగ్యం కాదు. న్యాయవ్యవస్థను సూటిగా అవమానించడమే. కస్టోడియల్ హింసను సమర్థించే వికృత మనస్తత్వానికి బహిరంగ ప్రదర్శన. ఈ దారుణంపై కేసు నమోదైంది.
ప్రభుత్వం నిందితుడిని సస్పెండ్ చేసింది. శాసనసభ్యుల క్రీడా కార్యక్రమంలో క్రికెట్ ఆడుతూ నాకు జరిగిన మణికట్టు ఫ్రాక్చర్‌ను ఆయుధంగా మార్చుకుని, కస్టోడియల్ టార్చర్ ఆరోపణలను తేలిక పరచాలని ప్రయత్నించడం అంటే బాధితుడిని మళ్లీ మళ్లీ బహిరంగంగా హింసించడమే. సునీల్‌నాయక్, సునీల్‌కుమార్‌పై కేసులు రాజకీయ ప్రతీకారం కాదు. నాటి జగన్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై న్యాయపోరాటం. సునీల్‌కుమార్‌కు స్పష్టంగా చేపుతున్నా. వ్యంగ్య వ్యాఖ్యలతో ఏ నిజాన్నీ మార్చలేరు. అహంకారంతో న్యాయాన్ని ఓడించలేరు. కులం ముసుగులో చట్టం నుంచి తప్పించుకోలేరు. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నిజం గెలుస్తుంది. కస్టోడియల్ హింసకు పాల్పడిన సునీల్ అరెస్టు తథ్యం.’ అని రఘురామ పేర్కొన్నారు.