ఇది కుట్రలో భాగం కాదా!
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:42 AM
నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వ హయాంలో కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన కేసులో నిందితుడైన బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ మూడో రోజు కూడా విచారణలో...
ఎఫ్‌ఐఆర్ నమోదుకు గంటన్నర ముందే అరెస్టుకు ఎలా రెడీ అయ్యారు?
గంట ముందే హైదరాబాద్‌కు ఎలా పయనమయ్యారు?
‘కస్టోడియల్ టార్చర్’పై వైద్య పరీక్షలకు తీసుకెళ్తే.. అక్కడికి మీరెందుకెళ్లారు?
రఘురామ కేసులో సునీల్‌నాయక్‌పై ప్రశ్నల వర్షం
సూటిగా.. స్పష్టంగా సమాధానాలు చెప్పని ఐపీఎస్
3వ రోజూ విచారణకు సహకరించని వైనం
నేడూ విచారణకు రావాలని ఆదేశం
గుంటూరు, మార్చి 7(ఆంధ్రజ్యోతి): నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వ హయాంలో కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన కేసులో నిందితుడైన బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ మూడో రోజు కూడా విచారణలో సూటిగా సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో సునీల్ నాయక్ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల విచారణలో సునీల్ నాయక్ పోలీసులకు సహకరించలేదు. దీంతో పోలీసులు మూడో రోజు పక్కా ఆధారాలతో సూటిగా ప్రశ్నించినప్పటికీ తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. విచారణ అధికారి, విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధారాలను సునీల్ నాయక్ ముందుంచి ప్రశ్నించారు. ‘రఘురామకృష్ణరాజుపై ఆరోజు ఉదయం 9.30 గంటలకు కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే ఆయనను అరెస్టు చేసేందుకు ఉదయం 8 గంటలకే పోలీసు బృందాలను ఎలా రెడీ చేశారు?’ అని ప్రశ్నించగా ‘ఏమో నాకు తెలియదు, వాళ్లు ఏ పని మీద వెళ్లారో’ అని సునీల్ నాయక్ బదులిచ్చినట్లు తెలిసింది. ‘మరి ముందు రోజే హైదరాబాదులోని రఘురామ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు! ఆ విషయం మీకు తెలుసా?’ అని ప్రశ్నించగా.. తెలియదని సమాధానం ఇచ్చారు. ‘ఉదయం 9.30 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదైతే, 8.30 గంటలకే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లామని బృందంలోని సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం బట్టి ఇది కుట్రలో భాగం కాదా!’ అని ప్రశ్నించగా.. ‘ఏమో నాకు తెలియదు.
వాళ్లు ఎన్ని గంటలకు వెళ్లారో’ అని చెప్పినట్లు సమాచారం. ‘అరెస్టు చేసే నాటికి రఘురామకృష్ణరాజు గుండె జబ్బుతో బాధపడుతున్నారనే విషయం మీకు తెలుసా?’ అని ప్రశ్నించగా తెలుసని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ‘మరి అక్కడికి వెళ్లిన తర్వాత మొదటి రోజు గానీ, రెండో రోజు గానీ ఆయన ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారా?’ అని ప్రశ్నిస్తే ఆరా తీయలేదని బదులిచ్చినట్లు సమాచారం. ‘ఆయన ఎంపీ అని, వీఐపీ అని, అందువల్లే పర్యవేక్షించామంటున్నారు! అసలు ఆ కేసులో ఫిర్యాదుదారు మీరే అయినప్పుడు, మీరు ఎలా పర్యవేక్షిస్తారు?’ అని ప్రశ్నించగా.. సరైన సమాధానం చెప్పలేకపోయినట్లు తెలిసింది. అదేమంటే ‘ఆయన ఎంపీ కదా! అందుకే వెళ్లాల్సి వచ్చింది’ అంటూ తప్పించుకునే ధోరణిలో సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సీఐడీ కార్యాలయంలో కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని, చిత్రహింసలకు గురి చేశారని కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసి, గాయాలను చూపడంతో తర్వాతి రోజు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లాలని మేజిస్ట్రేట్ ఆదేశించిన విషయం తెలిసిందే. ‘రఘురామకృష్ణరాజును వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకెళ్లిన సమయంలో ఆ కేసులో ఫిర్యాదుదారు మీరే, అంతేగాక ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు జీజీహెచ్‌కు ఎందుకు వెళ్లారు?’ అని ప్రశ్నించగా.. ‘ఆయన వీఐపీ, ఎంపీ.. కాబట్టి మంచీ చెడు చూద్దామని వెళ్లాను.
అంతేగానీ మరే ఉద్దేశం లేదు’ అని బదులిచ్చినట్లు తెలిసింది. ‘మరి డాక్టర్లతో ఏం మాట్లాడారు?’ అని ప్రశ్నించగా.. ‘నేను వెళ్లినప్పుడు డాక్టర్లు రాలేదు? ఏమీ మాట్లాడలేదు’ అని చెప్పినట్లు తెలిసింది. ‘మరి డాక్టర్లు వచ్చేవరకు ఉన్నారా?’ అని ప్రశ్నించగా.. ‘లేను. ఎక్కువసేపు ఉండకూడదని భావించి, మా వాళ్లకు చెప్పి వచ్చేసాను’ అని బదులిచ్చినట్లు సమాచారం. అనేక ప్రశ్నలకు సునీల్ నాయక్ నేరుగా సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలిసింది. ‘మీరు హైదరాబాద్‌లో రఘురామరాజును అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఒంటిపై గాయాలు ఉన్నాయా?’ అని ప్రశ్నించగా.. లేవని చెప్పినట్లు తెలిసింది. మరి రెండో రోజు అలా గాయాలతో ఎందుకు కుంటుతూ నడుస్తున్నారని ప్రశ్నించగా.. తెలియదని చెప్పినట్లు సమాచారం. ‘రఘురామను కస్టడీలో విచారించినప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా! ఆయనను ఎవరు కొట్టారు?’ అని ప్రశ్నించగా.. ‘నేను పక్క గదిలో ఉన్నాను. ఆయనను ఎవరు కొట్టారో నాకు తెలియదు’ అని బదులిచ్చినట్లు సమాచారం. పక్క గదిలో మీకు ఆయన అరుపులు వినపించలేదా? అని ప్రశ్నించగా, వినపడలేదని చెప్పినట్లు తెలిసింది. దీంతోఆదివారం కూడా విచారణకు హాజరుకావాలని సునీల్ నాయక్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురి చేసినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, సునీల్ నాయక్ దాచే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.