Share News

రగడ!

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:03 AM

‘‘నగరంపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. జేఎనఎనయూఆర్‌ఎం, టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. నాడు-నేడు పనుల్లో నిధుల గోల్‌మాల్‌ జరిగింది. నగరంలో ప్రజా సమస్యలు అధికమయ్యాయి. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా అధికార వైసీపీ కార్పొరేటర్‌లు ప్రచార పిచ్చిలో పడ్డారు. వీధుల్లో శిలాఫలకాలపై పేర్లు ముద్రించుకునేందుకు తాపత్రాయపడుతున్నారు’’ అంటూ విపక్ష కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా సాగింది. శిలాఫలకాలపై పేర్లు, నాడు-నేడు నిధుల గోల్‌మాల్‌ అంశాలపై జరిగిన చర్చ ఇరుపక్షాల మధ్య రగడకు దారితీసింది. 165 ప్రతిపాదనల్లో 70 ప్రతిపాదనలు వీధి పేర్లకు సంబంధించినవి ఉండటాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. అధికార వైసీపీకి ప్రజా పాలనపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమని విమర్శించాయి.

రగడ!

- ప్రజా సమస్యలపై కౌన్సిల్‌లో నిలదీసిన విపక్షాలు

- అధికార పక్షం పేర్ల ప్రచార ఆర్భాటంపై టీడీపీ, సీపీఎం ఆగ్రహం

- నాడు-నేడు పనుల్లో నిధుల గోల్‌మాల్‌పై తీవ్ర ఆరోపణలు

- సామాజిక పింఛన్లు, దోమలు, పారిశుధ్యం, జేఎనఎనయూఆర్‌ఎం, టిడ్కో ఇళ్లపై సుదీర్ఘ చర్చ

- ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు చొరవ చూపటం లేదని కార్పొరేటర్ల మండిపాటు

‘‘నగరంపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. జేఎనఎనయూఆర్‌ఎం, టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. నాడు-నేడు పనుల్లో నిధుల గోల్‌మాల్‌ జరిగింది. నగరంలో ప్రజా సమస్యలు అధికమయ్యాయి. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా అధికార వైసీపీ కార్పొరేటర్‌లు ప్రచార పిచ్చిలో పడ్డారు. వీధుల్లో శిలాఫలకాలపై పేర్లు ముద్రించుకునేందుకు తాపత్రాయపడుతున్నారు’’ అంటూ విపక్ష కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా సాగింది. శిలాఫలకాలపై పేర్లు, నాడు-నేడు నిధుల గోల్‌మాల్‌ అంశాలపై జరిగిన చర్చ ఇరుపక్షాల మధ్య రగడకు దారితీసింది. 165 ప్రతిపాదనల్లో 70 ప్రతిపాదనలు వీధి పేర్లకు సంబంధించినవి ఉండటాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. అధికార వైసీపీకి ప్రజా పాలనపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమని విమర్శించాయి.

కార్పొరేషన్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన నాడు- నేడు పనులపై కౌన్సిల్‌లో దుమారం రేగింది. పనుల్లో భారీగా జరిగిన నిధుల గోల్‌మాల్‌పై చర్చకు విపక్షం పట్టుబట్టింది. వైసీపీ నాయకులు నాడు-నేడు పనుల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని విపక్షం చేసిన ఆరోపణలపై అధికార వైసీపీ కార్పొరేటర్లు ఎదురుదాడికి దిగారు. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. నాడు-నేడు కింద రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని వైసీపీ ప్రశ్నించింది. దీంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు పోటాపోటీగా ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకున్నారు. వైసీపీ అభివృద్ధిని టీడీపీ తమ అభివృద్ధిగా చెప్పుకుంటుందని, వైసీపీ రంగులు చెరిపి, పసుపు రంగు వేసుకుంటుందని ఆరోపించారు. దీన్ని టీడీపీ తిప్పికొట్టింది. వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో మేయర్‌ సమావేశాన్ని ఐదు నిమిషాలు వాయిదా వేశారు.

దోమలు, పారిశుధ్యంపై వాడీవేడి చర్చ

నగరంలోని 64 డివిజన్‌లలో దోమల సమస్య తీవ్రంగా ఉందని అధికార, విపక్ష కార్పొరేటర్లు ముక్త కంఠంతో కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. మలేరియా విభాగం తూతూ మంత్రంగా యాంటీ లార్వా ఆపరేషన్‌ పనులు చేస్తుందని, నాణ్యతలేని, నాసిరకం మందులు పిచికారి చెయ్యటంతో దోమల వృద్ధి పెరుగుతుందని కార్పొరేటర్లు ఆరోపించారు. అధికారుల పనితీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. దోమల నివారణ చర్యలు మొక్కుబడిగా సాగుతున్నాయని, ఫాగింగ్‌ కూడా అంతేనని మండిపడ్డారు. దీనిపై కమిషనర్‌ స్పందించాలని మేయర్‌ ద్వారా కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు.

అడ్డగోలుగా ఇళ్ల కేటాయింపు!

నగరంలో ఉన్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల కేటాయింపు అడ్డగోలుగా జరుగుతుందని, కాల్వ గట్లపై తొలగించిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించామని అధికారులు చేస్తున్న ప్రకటన పారదర్శకంగా లేదని కార్పొరేటర్లు ఆరోపించారు. ఇళ్ల కేటాయింపు అంశాన్ని కౌన్సిల్‌లో పెట్టాల్సి ఉందని, ఆ విధంగా అధికారులు చర్యలు తీసుకోకుండా ఇళ్లు కేటాయించారని వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తెచ్చిన కొందరికి ఇళ్లు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మేయర్‌ భాగ్యలక్ష్మి ప్రత్యేకంగా కేటాయించిన ఇళ్ల లబ్ధిదారుల వివరాలు మరోసారి పరిశీలించాలన్నారు. కమిషనర్‌ ధ్యానచంద్ర స్పందిస్తూ కేటాయింపులన్నీ ప్రభుత్వ నిబంధనల మేరకే జరిగాయని, కాల్వగట్లు, ఇతర ప్రాంతాలలో తొలగించిన బాధితులకు రూ.66 వేలు కట్టించుకొని కేటాయించడం జరిగిందని తెలియజేశారు. అలాగే టిడ్కో లబ్ధిదారులకు ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు ఇవ్వకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరితగతిన అందించాలని పలువురు కార్పొరేటర్లు కోరారు.

పింఛన్లపై రాజకీయ రచ్చ

సామాజిక పింఛన్లపై వైసీపీ, టీడీపీ కార్పొరేటర్‌లు పరస్పర రాజకీయ ఆరోపణలు చేసుకున్నారు. మా ప్రభుత్వం హయాంలో అర్హులందరికీ పింఛన్లు సక్రమంగా అందించామని, ఎవరి పింఛన్లు తొలగించలేదని, టీడీపీ ప్రభుత్వం రూ.వెయ్యి పెంచి సుమారు ఆరున్నర లక్షల మంది పింఛన్లు తొలగించారని, వైసీపీ పథకాలను పేరు మార్చి టీడీపీ వాడుతుందని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా పథకాలను అమలు చేస్తుందని, ఏ పథకాన్ని ఆపలేదని, వైసీపీ కార్పొరేటర్లకు అభివృద్ధి కనిపించడంలేదని టీడీపీ కార్పొరేటర్‌లు ఎదురుదాడి చేశారు.

నిధులు రాబట్టడంలో వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు విఫలం

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ బి.సత్యబాబు దుయ్యబట్టారు. నగరాభివృద్ధిని పక్కన పెట్టి వీధులు, శిలాఫలకాలపై పేర్ల ఆర్బాటానికి హడాహుడి చేస్తున్నారన్నారు. నగరంలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు పాలకపక్షం చొరవ చూపడం లేదని విమర్శంచారు.

Updated Date - Feb 22 , 2026 | 01:03 AM