Share News

మా కుమార్తెను అల్లుడే చంపేశాడు!

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:13 AM

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పదంగా మృతిచెందిన విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రాధాగాయత్రి తల్లి సత్యవతి, ఇతర కుటుంబసభ్యులు..

మా కుమార్తెను అల్లుడే చంపేశాడు!

  • దర్యాప్తును వేగవంతం చేసేలా ఒత్తిడి తీసుకురండి

  • పల్లాను కలిసిన రాధాగాయత్రి తల్లి, కుటుంబసభ్యులు

విశాఖపట్నం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పదంగా మృతిచెందిన విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రాధాగాయత్రి తల్లి సత్యవతి, ఇతర కుటుంబసభ్యులు సోమవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిశారు. తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని, ఉత్తరాఖండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఆ రాష్ట్ర పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దీంతో హోం మంత్రి అనితకు పల్లా ఫోన్‌ చేశారు. ప్రభుత్వ పరంగా రాధాగాయత్రి కేసులో జోక్యం చేసుకునే విషయాన్ని పరిశీలించాలని కోరారు. అనంతరం డీసీపీ-2 మేరీ ప్రశాంతికీ ఫోన్‌ చేశారు. తమ అల్లుడు విశాఖలోనే ఉన్నాడని, అతడిని పట్టుకుని లోతుగా విచారించాలని, ఈ కేసులో ముస్సోరి పోలీసులతో కలిసి ముందుకెళ్లే అంశాన్ని పరిశీలించాలని డీసీపీని రాధాగాయత్రి తల్లి కోరారు. గాయత్రి మృతిపై ముస్సోరి పోలీసులు ఇప్పటికే హత్యానేరం కేసు నమోదు చేశారని, కేసు దర్యాప్తులో ఉందని డీసీపీ తెలిపారు. అక్కడి పోలీసులు కోరితే సహకరిస్తామని, చట్టపరంగా ఏ ఒక్క అంశాన్ని నిర్లక్ష్యం చేయబోమని పల్లాకు వివరించారు. పల్లా మాట్లాడుతూ గాయత్రి మృతి బాధాకరమని, నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేదిలేదన్నారు. కఠిన శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 05:13 AM