53శాతం సీట్లలో విజేతలు బీసీలే: ఆర్.కృష్ణయ్య
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:55 AM
మున్సిపల్ ఎన్నికల్లో 53శాతం సీట్లలో బీసీలు గెలవడం వారి చైతన్యానికి నాంది అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.
రాంనగర్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో 53శాతం సీట్లలో బీసీలు గెలవడం వారి చైతన్యానికి నాంది అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రాదేశిక (ఎంపీటీసీ, జడ్‌పీటీసీ) ఎన్నికల్లో చట్టబద్ధంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని.. అంత వరకూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వంతోపాటు తమకు అన్యాయం చేయడానికి కుట్రలు చేసిన పార్టీలకు బీసీలు తగిన గుణపాఠం నేర్పారని విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో శనివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన చెప్పారు. మునిసిపల్ ఎన్నికల్లో 42ు అమలు చేస్తామని ప్రకటించి 28 శాతానికి తగ్గించి అక్రమాలకు పాల్పడటం దుర్మార్గమని కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో దాఖలైన 62 కేసుల విచారణకు సీనియర్ న్యాయవాదులను నియమించాలన్నారు. త్వరితగతిన ఆయా కేసుల విచారణను చేపట్టేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.