Share News

నిషిద్ధ భావాలకు ప్రశ్న రావణ్‌ బాసట

ABN , Publish Date - Jul 07 , 2026 | 05:23 AM

నిషిద్ధ భావాలకు బచ్చలకూరి జోసఫ్‌ అలియాస్‌ ‘ప్రశ్న’ రావణ్‌ బాసటగా నిలిచినట్టు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు తెలిపారు. మావోయిస్టు సిద్ధాంతాలను వ్యాప్తిచేస్తూ....

నిషిద్ధ భావాలకు ప్రశ్న రావణ్‌ బాసట

  • మావోయిస్టు సంస్థలపై వీడియోలు

  • నక్సల్‌ నేత హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు

  • హిందూ దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలు

  • రాజ్యాంగ పదవుల్లోని ప్రజాప్రతినిధులపై

  • యూట్యూబ్‌, ఇన్‌స్టాలో నీచమైన వ్యాఖ్యలు

  • కులాల మధ్య విద్వేషాలకు ప్రయత్నాలు

  • రాష్ట్రంలో ఆయనపై ఎనిమిది కేసులు

  • కోర్టుకు పోలీసుల రిమాండ్‌ రిపోర్టు

  • నెల్లూరు జైలుకు రావణ్‌

  • పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌

విజయవాడ, నెల్లూరు (క్రైమ్‌), జూలై 6 (ఆంధ్రజ్యోతి): నిషిద్ధ భావాలకు బచ్చలకూరి జోసఫ్‌ అలియాస్‌ ‘ప్రశ్న’ రావణ్‌ బాసటగా నిలిచినట్టు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు తెలిపారు. మావోయిస్టు సిద్ధాంతాలను వ్యాప్తిచేస్తూ, దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు చేసినట్టు పేర్కొన్నారు. సాయుధ తిరుగుబాటును ప్రోత్సహిస్తూ, మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ వీడియోలు విడుదల చేశారంటూ యూట్యూబర్‌ ‘ప్రశ్న’ రావణ్‌పై ‘ఉపా’ (చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) కింద గన్నవరం పోలీసులు శనివారం రాత్రి కేసు పెట్టిన విషయం తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో, సోమవారం ఆయనను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. అయితే, తమ కస్టడీలో విచారణకు రావణ్‌ ఏమాత్రం సహకరించలేదని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ‘‘నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలాన్ని రావణ్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను రెచ్చగొడుతున్నారు. వివిధ వేదికలపై రెచ్చగొట్టేలా ప్రసంగాలు, మతపరమైన విద్వేషాలను సృష్టించేలా వ్యాఖ్యలు చేశారు. వాటిని వీడియోలుగా చిత్రీకరించి తన యూట్యూబ్‌తోపాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఏలూరులో నిర్వహించిన దళిత క్రిస్టియన్‌ సభలో రావణ్‌ కులాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగించారు. రావణ్‌ యూట్యూబ్‌, ఇన్‌స్టా అకౌంట్లను పరిశీలించగా, వాటి నిండా ప్రజల మధ్య కుల మత విభేదాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేసిన వీడియోలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులపై వాటిలో అత్యంత అసభ్యకరంగా వ్యాఖ్యలున్నాయి. 2025 నవంబరు 25న ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు నేత హిడ్మాను పొడుగుతూ వీడియోను పోస్టు చేశారు. మరణించిన వారిని ఉద్దేశించి జోహర్‌ ప్రజాయుద్ధ వీరుల్లారా... అని కీర్తించారు. వారు మరణించినా ప్రజాయుద్ధం కొనసాగుతుందని మాట్లాడారు. ఈ వీడియోను 29వేల మంది వీక్షిస్తే, 2800 మంది అనుకూలంగా పోస్టులు చేశారు. అంతేగాకుండా సనాతన ధర్మం, హిందూ దేవతలతోపాటు రామాయణం, మహాభారతం ఇతిహాసాలపై రావణ్‌ అవమానకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.


వీడియోలు తొలగింపు

ప్రజల మధ్య విద్వేషాలు పుట్టించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రావణ్‌పై గన్నవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన తర్వాత ఆ వీడియోలను తొలగించారు. విచారణలో రావణ్‌ ఏమాత్రం సహకరించలేదు. డిజిటల్‌ సాక్ష్యాలను ధ్వంసం చేశాడు. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌,, ఇతర సోషల్‌ మీడియాలో రావణ్‌కు అకౌంట్లు ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తున్న ఎలకా్ట్రనిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. గూగుల్‌ తదితర సోషల్‌ మీడియా సంస్థలకు నోటీసులు జారీచేసి లాగిన్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, యూజర్‌ ఐడీలు, ఐపీ లాగ్‌లు తెలుసుకోవాల్సి ఉంది. నిందితుడిపై రాష్ట్రంలో కాకినాడ జిల్లా సర్పవరం, పిఠాపురం, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, నిడదవోలు టౌన్‌, ఏలూరు త్రీటౌన్‌, విజయవాడ వన్‌టౌన్‌లో కేసులు నమోదయ్యాయి’’ అని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

పది రోజుల కస్టడీకి ఇవ్వండి

బచ్చలకూరి జోసఫ్‌ అలియాస్‌ రావణ్‌ను పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణకు ఏమాత్రం సహకరించలేదని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు వ్యక్తులు ఎవరన్న విషయాన్ని బయటకు తీయాల్సి ఉందని కోర్టును తెలిపారు.

Updated Date - Jul 07 , 2026 | 05:23 AM