క్వాంటమ్ గేమ్ చేంజర్
ABN , Publish Date - Feb 08 , 2026 | 03:57 AM
మరో 35, 40 ఏళ్ల పాటు యువత భవితను తీర్చిదిద్దేలా సాంకేతిక రంగం వైపు అడుగులు వేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
తొలి కంప్యూటింగ్ వ్యవస్థ అమరావతిలో
డిసెంబరు నాటికి తొలి ‘కంప్యూటర్’ చేతికి
దీంతో 35-40 ఏళ్లపాటు యువత భవిత బంగారమే
కేవలం క్వాంటమ్‌కు మాత్రమే కాదు, లక్షల్లో నిపుణుల తయారీకీ నాంది పలుకుతున్నా
క్వాంటమ్‌లో నోబెల్ తెస్తే 100 కోట్ల నజరానా: సీఎం
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి శంకుస్థాపన
15 ప్రముఖ సంస్థలతో ఎంవోయూలు
త్వరలోనే క్వాంటమ్‌లో ఎంటెక్ కోర్సులు
రూ.6వేల కోట్లతో నేషనల్ క్వాంటమ్ మిషన్: జితేంద్ర సింగ్
హైదరాబాద్‌లో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించాం. అది ఓ గేమ్ చేంజర్‌గా మారింది. అత్యున్నత ఫలితాలను ఇస్తోంది. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తున్నాం. ఇది కూడా ఒక విప్లవంగా మారుతుంది.
- సీఎం చంద్రబాబు
అమరావతి, గుంటూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మరో 35, 40 ఏళ్ల పాటు యువత భవితను తీర్చిదిద్దేలా సాంకేతిక రంగం వైపు అడుగులు వేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చరిత్రను సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా అది విద్యార్థులకే సాధ్యమని వ్యాఖ్యానించారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాలకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తో కలిసి శనివారం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వాంటమ్ కంప్యూటింగ్ మొత్తం దేశానికే గేమ్ చేంజర్ కానుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థి కృత్రిమ మేధ (ఏఐ) , క్వాంటమ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన బిల్ గేట్స్ ఏపీకి వస్తున్నారని తెలిపారు. ‘ఇక్కడ ఈరోజు ‘క్వాంటమ్ వ్యాలీ భవనాలకు మాత్రమే నేను పునాది వేయడం లేదు. గ్లోబల్ క్వాంటమ్ కంప్యూటింగ్ విప్లవంలో భాగస్వామ్యమయ్యే నిపుణుల తయారీకి కూడా నాంది పలుకుతున్నాను. ఐక్య రాజ్యసమితి ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక సామర్థ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
నిన్న ఐటీ.. నేడు ఏఐ, క్వాంటమ్‌లదే భవిష్యత్తు
‘‘గతంలో వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాలను అందుకోలేకపోయాం. ఐటీ రంగాన్ని మాత్రం దక్కించుకున్నాం. ఇప్పుడు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌లను సాధించుకోగలుగుతున్నాం. సాంకేతిక విప్లవాన్ని ఆదరించే ప్రధాని నరేంద్రమోదీ ఉండటం ఈ క్రమాన్ని వేగవంతం చేస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకున్న దేశానిదే భవిష్యత్తు. క్వాంటమ్ ఆకృతులు, ఉత్పత్తులు, ఇంటిలెక్చుయల్ ప్రాపర్టీ్‌సకు అమరావతి కేంద్రం కానుంది. డిఫెన్స్, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఫైనాన్స్, క్లైమెట్ మోనెటరింగ్‌కు అమరావతి గమ్యస్థానం కానుంది. ఇప్పటిదాకా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడేవారు. భవిష్యత్తులో అందరూ అమరావతి క్యాంటమ్ వ్యాలీ గురించే మాట్లాడతారు. ఈ రంగంలో ప్రపంచ శ్రేణి టెక్నాలజీ నగరంగా అమరావతి మారనుంది. భారత్‌లోనే మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రాన్ని ఇక్కడ ఐబీఎంటీసీఎస్, ఎల్ అండ్ టీ ఏర్పాటుచేస్తున్నాయి.’’
2030 నాటికి 2.50 లక్షల మంది నిపుణులే లక్ష్యం
‘‘ప్రధాని మోదీ ఆధునిక సాంకేతికతను బాగా అర్థం చేసుకున్నారు. సరైన సమయంలో సరైన వ్యక్తి సరైన చోట ప్రధానిగా ఉన్నారు. కేంద్రం ప్రారంభించిన క్వాంటమ్ కంప్యూటింగ్ విప్లవాన్ని రాష్ట్రం అందిపుచ్చుకుంది. తక్కువ సమయంలోనే వీటి ఏర్పాటుకు ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ ఏడాది డిసెంబరు నుంచి రాష్ట్రంలో తొలి క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయడం ప్రారంభిస్తుంది. వీటిని 65 శాతం మేర దేశంలోనే తయారుచేస్తాం. ఈ రంగంలో నోబెల్ బహుమతి సాధించేవారికి రూ.100 కోట్లను పురస్కారంగా అందిస్తాం. 2030 నాటికి రెండున్నర లక్షల నిపుణులు ఇక్కడ పనిచేయడానికి అవసరం. ఇందులోభాగంగా వైజర్ సంస్థ ఇచ్చిన శిక్షణను యాభైవేలమంది ఇంజనీరింగ్ విద్యార్థులు పొందారు. దశల వారీగా 35 లక్షల మంది విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడాన్ని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఐఐటీ మద్రాసు అడ్వాన్స్‌డ్ కోర్సుల కోసం దేశవ్యాప్తంగా 2.06 లక్షల మంది తమ పేరు నమోదు చేయించుకున్నారు. ఇక ప్రపంచవ్యాపంగా ఈ రంగంలో 50 లక్షల మంది శిక్షణ పొందుతుంటే, అందులో పది లక్షల మంది ఆంధ్రా యువకులే ఉన్నారు. ఐఎస్సీ తరహాలోనే ఏఐ లివింగ్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ అవసరాల కోసం అమరావతిలో వర్సిటీని ఏర్పాటుచేస్తున్నాం. ప్రస్తుతం మేధా టవర్స్‌లో వీటిని తాత్కాలికంగా ప్రారంభిస్తున్నాం. త్వరలోనే శాశ్వత భవనాలను నిర్మిస్తాం. రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ వర్సిటీతో పాటు స్పేస్ టెక్నాలజీ వర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఔషధాల ఆవిష్కరణ, వ్యక్తిగత ఆరోగ్యం, వాతావరణ అంచనాలు, క్రాప్ ప్లానింగ్, వాటర్ మేనేజ్‌మెంట్, పంటల ఉత్పత్తులు తదితర అంశాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను వినియోగిస్తాం. అమరావతి డీప్ టెక్నాలజీ ప్రయాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.