Share News

క్వాంటమ్‌ మేమూ నేర్చుకుంటాం!

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:04 AM

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌.. ఇప్పుడు ప్రపంచమంతా ఈ టెక్నాలజీవైపే చూస్తోంది...! అయితే భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్న ఈ టెక్నాలజీని సొంతం చేసుకోవడం ఎలా..

క్వాంటమ్‌ మేమూ నేర్చుకుంటాం!

  • ఎన్‌పీటీఈఎల్‌ ఆధ్వర్యంలో క్వాంటమ్‌ కోర్సు ప్రారంభం

  • అన్ని కోర్సుల విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన

  • ఇంజనీరింగ్‌, డెంటల్‌, ఫార్మసీ, అగ్రి విద్యార్థులు కూడా

  • రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 60 వేల మంది నమోదు

  • కోర్సు పూర్తి చేసిన వారికి ఇంటర్న్‌షి్‌పలో ఒక క్రెడిట్‌

  • ఉన్నత విద్యామండలి చర్యలతో సత్ఫలితాలు

  • (అమరావతి - ఆంధ్రజ్యోతి)

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌.. ఇప్పుడు ప్రపంచమంతా ఈ టెక్నాలజీవైపే చూస్తోంది...! అయితే భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్న ఈ టెక్నాలజీని సొంతం చేసుకోవడం ఎలా..? ఇది సాఫ్ట్‌వేర్‌ రంగానికే పరిమితమా..? విద్యార్థుల కెరీర్‌కు కొత్త దిక్సూచిలా మారిన క్వాంటమ్‌ టెక్నాలజీని నేర్చుకోవడం.. కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థులకే సాధ్యమవుతుందా..? అనే అపోహలు నెలకొన్నాయి..! అయితే.. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ భవిష్యత్‌ గతిని మార్చేసే క్వాంటమ్‌ టెక్నాలజీని మేమూ నేర్చుకుంటాం అంటూ ఇతర కోర్సుల విద్యార్థులూ ముందుకొస్తున్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌’ (ఎన్‌పీటీఈఎల్‌).. ఐఐటీ మద్రాస్‌, ఐబీఎం సహకారంతో చేపట్టిన క్వాంటమ్‌ కోర్సులు నేర్చుకునేందుకు రాష్ట్రం నుంచి రికార్డు స్థాయిలో విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దేశంలోనే అత్యధిక స్థాయిలో 60 వేల మంది ఈ కోర్సు నేర్చుకునేందుకు ముందుకొచ్చారు. దాదాపు అన్ని కోర్సుల విద్యార్థులూ దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ‘ఇంట్రడక్షన్‌ టు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌: క్వాంటమ్‌ ఆల్గరిథమ్స్‌ అండ్‌ క్విస్కిట్‌’ పేరిట ఎన్‌పీటీఈఎల్‌ చేపట్టిన క్వాంటమ్‌ కోర్సు ఈ నెల 19న ప్రారంభమైంది. ఐఐటీ మద్రాస్‌, ఐబీఎం ప్రొఫెసర్లు దీన్ని అందిస్తున్నారు. కోర్సు అనంతరం సర్టిఫికెట్‌ కావాలనుకున్నవారికి పరీక్ష నిర్వహిస్తారు. సర్టిఫికెట్‌ పొందిన విద్యార్థులకు ఈ కోర్సును ఇంటర్న్‌షి్‌పగా భావించి ఒక క్రెడిట్‌ ఇస్తారు. తద్వారా అటు రెగ్యులర్‌ కోర్సుతో పాటు భవిష్యత్తులోనూ ఈ సర్టిఫికెట్‌ విద్యార్థులకు ఉపయోగపడనుంది.


నాలుగు వారాల ఆన్‌లైన్‌ కోర్సు

నాలుగు వారాల పాటు సాగే ఈ కోర్సు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. కోర్సుకు ఇంకా నమోదు చేసుకుంటూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి అత్యధికంగా 3,774 మంది, కెహెచ్‌ఐటీ నుంచి 2,616, ఎన్‌ఆర్‌ఐ కాలేజీ నుంచి 2,550, అన్నమాచార్య ప్రైవేటు యూనివర్సిటీ నుంచి 1,998, లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ నుంచి 1,873, శ్రీవిష్ణు కాలేజీ నుంచి 1,758, రఘు ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి 1,678, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి 1,357, ఒంగోలులోని క్యూఐఎస్‌ కాలేజీ నుంచి 1,330, ఆదిత్య కాలేజీ నుంచి 1,323, విజయవాడ సిద్ధార్థ అకాడమీ నుంచి 1,151, మిట్స్‌ నుంచి 1,100 మంది విద్యార్థులు క్వాంటమ్‌ కోర్సు నేర్చుకుంటున్నారు.

కోర్సులకు అతీతంగా...

క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ కేవలం సాఫ్ట్‌వేర్‌ రంగానికే పరిమితం కాదు. అన్ని రంగాలకూ ఉపయోగపడుతుందని క్వాంటమ్‌ నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో అన్ని కోర్సుల విద్యార్థులు క్వాంటమ్‌ టెక్నాలజీ్‌సపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇంజనీరింగ్‌తో పాటు సాధారణ డిగ్రీ విద్యార్థులు అనేక మంది క్వాంటమ్‌ కోర్సు నేర్చుకుంటున్నారు. ఫార్మసీ, పాలిటెక్నిక్‌, డెంటల్‌, పీజీ, ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, వైద్య, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు కూడా క్వాంటమ్‌ కోర్సులో చేరారు. లక్ష మంది క్వాంటమ్‌ నిపుణుల్ని తయారుచేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు చెబుతున్నారు. ఉన్నత విద్యామండలితో పాటు నైపుణ్యాభివృద్ధి శాఖ ద్వారా కూడా కోర్సులు అందిస్తోంది. దానికి 50 వేల మంది వరకూ దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.

త్వరలో క్వాంటమ్‌ హ్యాకథాన్‌ ఫైనల్‌

క్వాంటమ్‌ టెక్నాలజీ్‌సను ప్రోత్సహించడంలో భాగంగా ఉన్నత విద్యామండలి ఇటీవల అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ హ్యాకథాన్‌ను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 30వేల మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు దీనిలో పాల్గొన్నారు. క్వాంటమ్‌ టెక్నాలజీలో ప్రాబ్లమ్స్‌కు పరిష్కారం చూపడంపై ఈ పోటీలు జరిగాయి. త్వరలో జరగబోయే ఫైనల్స్‌కు 700 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. సీఎం చంద్రబాబు సమక్షంలో పోటీలు నిర్వహించేందుకు మండలి సిద్ధమైంది.

క్వాంటమ్‌ కోర్సులో ఇదొక రికార్డు

‘ఎన్‌పీటీఈఎల్‌ అందిస్తున్న కోర్సుకు ఏపీ నుంచి 60 వేల మంది విద్యార్థులు నమోదుచేసుకోవడం ఓ మైలురాయి. టెక్నాలజీలో రాష్ర్టాన్ని గ్లోబల్‌ హబ్‌గా మార్చాలన్న సీఎం చంద్రబాబు మార్గనిర్దేశంలో ఇది సాధ్యమైంది. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ హ్యాకథాన్‌ ద్వారా ఇంత పెద్దఎత్తున విద్యార్థులు క్వాంటమ్‌ కోర్సు నేర్చుకునేందుకు ముందుకొచ్చారు. తద్వారా క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ లేబొరేటరీలకు మాత్రమే పరిమితం కాదని నిరూపించారు. భవిష్యత్తులో క్వాంటమ్‌ టెక్నాలజీ దేశాల ఆర్థిక, వ్యూహాత్మక అధికారాన్ని నిర్దేశిస్తుంది.’ - కె.మధుమూర్తి; ఉన్నత విద్యా మండలి చైర్మన్‌

Updated Date - Jan 21 , 2026 | 04:40 AM