కుట్రలపై ఎన్‌ఐఏ నిఘా
ABN , Publish Date - Jul 10 , 2026 | 03:55 AM
‘రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయి. ప్రశ్నించే పేరుతో రావణ్ వంటి వారిని కొందరు ప్యాకేజీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.
ప్రశ్న పేరుతో దూషిస్తే ఊరుకోం: మాధవ్
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయి. ప్రశ్నించే పేరుతో రావణ్ వంటి వారిని కొందరు ప్యాకేజీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హెచ్చరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ‘మన ఊరు... మన జెండా’ కార్యక్రమంపై వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘విమర్శలు హద్దు దాటితే సహించే ప్రసక్తే లేదు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర చేస్తున్న శక్తులపై నిఘా ఉంది. నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ ఆధ్వరంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులపై కఠినచర్యలు తప్పవు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బీజేపీకి బలమైన సంస్థాగత నిర్మాణం ఉండాలి. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేయాలి’ అని మాధవ్ పిలుపునిచ్చారు.