Share News

దేశాభివృద్ధికి కాంగ్రెస్‌, వామపక్షాల మోకాలడ్డు

ABN , Publish Date - Jul 25 , 2026 | 05:33 AM

‘నీట్‌’ నిర్వహణలో తలెత్తిన సమస్యను ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయని, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువతను రెచ్చగొడుతున్నాయని..

దేశాభివృద్ధికి కాంగ్రెస్‌, వామపక్షాల మోకాలడ్డు

  • రాజకీయ ప్రయోజనాల కోసం యువతను రెచ్చగొడుతున్నారు: మాధవ్‌

విశాఖపట్నం, జూలై 24(ఆంధ్రజ్యోతి): ‘నీట్‌’ నిర్వహణలో తలెత్తిన సమస్యను ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయని, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువతను రెచ్చగొడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వలో దేశం అభివృద్ధి పథాన ముందుకు వెళుతుంటే, స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు మోకాలడ్డుతున్నాయి. యువత భవితను దృష్టిలో ఉంచుకొని విద్యా రంగంలో మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చింది. ఆంధ్రలో 17 మెడికల్‌ కాలేజీలు, ఐఐటీ, ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రోలియం యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది. నీట్‌కు సంబంధించిన అక్రమాలపై దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడం విచారకరం. నీట్‌ను సాకుగా చూపిం చి ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టులపై వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. రాహుల్‌ గాంధీకి ధైర్యం ఉంటే కాంగ్రెస్‌ హయాంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీపై పార్లమెంటులో చర్చించాలి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుంది. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రధాని నరేంద్ర మోదీకి 13 వేల మంది కళాకారులతో థింసా నృత్యం, బొబ్బిలి వీణానాదంతో స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలమంచిలి నియోజకవర్గంలోని పంచదార్ల క్షేత్రం వద్ద గిరి ప్రదక్షిణ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం’ అని మాధవ్‌ తెలిపారు.

Updated Date - Jul 25 , 2026 | 05:34 AM