తమిళ జాలర్లను కట్టడి చేయాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 05:44 AM
తమిళనాడు మత్స్యకారులు మన తీరానికి వచ్చి నెల్లూరు, ఒంగోలు, బాపట్ల ప్రాంతాల్లోని జాలర్లతో తరచూ గొడవలు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీసుకెళ్లారు.
ఏపీ జాలర్లకు భరోసా ఇవ్వాలి: సీఎంను కోరిన మాధవ్
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): తమిళనాడు మత్స్యకారులు మన తీరానికి వచ్చి నెల్లూరు, ఒంగోలు, బాపట్ల ప్రాంతాల్లోని జాలర్లతో తరచూ గొడవలు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి నలుగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని, మన జాలర్లలో ఉన్న ఆందోళనను పూర్తిగా తొలగించాలని కోరారు. అమరావతిలోని సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా సమస్య తీవ్రతను వివరించారు. అయితే పొరుగు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక అక్కడ ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో చర్చించే ఆలోచనలో ఉన్నట్టు చంద్రబాబు మాధవ్‌కు చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని హోంగార్డుల సమస్యల్ని కూడా చంద్రబాబు దృష్టికి మాధవ్ తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య 400మంది రాష్ట్ర బదిలీ కోసం ఎదురు చూస్తున్నారని, వారిని సొంత కుటుంబాల చెంతకు చేర్చాలని కోరారు.