క్రీడా చాంపియన్ల కేంద్రంగా ఏపీ
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:53 AM
క్రీడా రంగంలో చాంపియన్లకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందాలని, అందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్ ఆకాంక్ష
పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమి పూజ
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): క్రీడా రంగంలో చాంపియన్లకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందాలని, అందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. నగరంలోని ఆరిలోవలో పీవీ సింధు సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి బుధవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. కేవలం ఏపీకి చెందిన క్రీడాకారులకే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాల క్రీడాకారులకు ఈ అకాడమీ గమ్యస్థానంగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఇక, రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామన్న ఆయన.. క్రీడాకారులు ఎప్పుడైనా తనను కలవవచ్చన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు అవకాశాలు కోల్పోకూడదనీ.. అందుకే క్రీడాకారుల వెంటే తమ ప్రభుత్వం ఉంటుందని మంత్రి అన్నారు. పీవీ సింధులాగే మిగతా క్రీడాకారులంతా గొప్ప స్థాయిలో రాణించాలని లోకేశ్ ఆకాంక్షించారు. ‘చిరుప్రాయంలోనే రాకెట్ పట్టిన సింధు ఎప్పుడూ ప్రాక్టీస్‌లోనే నిమగ్నమయ్యేది. అప్పట్లో కెమెరాలు లేవు. వార్తల్లో ఆమె పేరు తెలియదు. పతకాలు కూడా లేవు. అయితే ఉన్నదంతా క్రమశిక్షణ, త్యాగం, సంకల్పం. అవే ఇప్పుడు సింధును ఈస్థాయిలో నిలబెట్టాయి. ఒలింపిక్ విజేతగా, ప్రపంచ చాంపియన్‌గా, భారత దిగ్గజ షట్లర్లలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందడం గర్వంగా ఉంది’ అని మంత్రి ప్రశంసించారు. ప్రతి చాంపియన్ వెనుక ఒక తల్లి, నమ్మకం కోల్పోని తండ్రి, వెనుకంజ వేయని కోచ్ ఉంటారనీ.. సింధు విజయాల్లో ఆమె తండ్రి పీవీ రమణ, తల్లి విజయ కృషి ఎంతో ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. అలాగే సింధును చాంపియన్‌గా తీర్చిదిద్దిన కోచ్‌కు నమస్కారాలు తెలుపుతున్నానన్నారు.
ఇటీవల వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన రాష్ట్ర క్రీడాకారులను కలుసుకునే అవకాశం తనకు లభించిందన్న లోకేశ్.. ఆరోజు సాయంత్రం తమతో విందులో పాల్గొన్న సింధు చెప్పిన విషయాలు తనను ఆలోచింపజేశాయన్నారు. తన ప్రయాణం, లక్ష్యం, సాధించిన విజయాలను భావితరాలను అందించాలనే దిశగా ఆమె అడుగులు వేస్తోందన్నారు. అదే స్ఫూర్తితో విశాఖపట్నాన్ని క్రీడారంగంలో గొప్ప కేంద్రంగా మార్చగలరనే విశ్వాసం తనకు ఉందన్నారు. క్రీడలకు సంబంధించి ఆస్ట్రేలియాలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, కతార్‌లో అస్రైర్ అకాడమీ, దేశంలో ఇన్‌స్పైర్ స్పోర్ట్స్ వంటి సంస్థల్లో శిక్షణ పొందిన వారంతా చాంపియన్లు అవుతున్నారన్నారు. అలాంటి అకాడమీని ప్రారంభించాలని సింధు అనుకున్నదని, ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుతో పంచుకున్నప్పుడు బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా, అన్ని క్రీడల కోసం అకాడమీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని లోకేశ్ తెలిపారు.