పవన్ ‘మ్యాజిక్’ భేష్
ABN , Publish Date - May 04 , 2026 | 04:25 AM
గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్యసాధన కోసం ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ మెడలిస్టు పీవీ సింధు ప్రశంసించారు.
గ్రామీణాంధ్రప్రదేశ్ కోసం వినూత్న కార్యక్రమాలు
సరికొత్త మ్యాజిక్ డ్రెయిన్లతో పారిశుధ్యం మెరుగు
ప్రజలకు ఆరోగ్యం.. భూగర్భ జలాలు వృద్ధి
ఉప ముఖ్యమంత్రికి పీవీ సింధు ప్రశంసలు
అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్యసాధన కోసం ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ మెడలిస్టు పీవీ సింధు ప్రశంసించారు. ఉపముఖ్యమంత్రిగా ఆయన 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పవన్ ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న మ్యాజిక్ డ్రెయిన్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడం ద్వారా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు. పల్లెల్లో మురుగు సమస్య నివారణలో మ్యాజిక్ డ్రెయిన్లు గేమ్ చేంజర్ లాంటివన్నారు. పాలనా వ్యవహారాలు కొత్తే అయినా పవన్ వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారని పేర్కొన్నారు. ‘మన దేశంలో మెజారిటీ శాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం పెద్ద సవాలుగా నిలిచింది. సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. ఈ సమస్యకు పవన్ కల్యాణ్ మ్యాజిక్ డ్రైయిన్ల రూపంలో అద్భుత పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఇంకుడు గుంతలతో కూడిన డ్రెయిన్లు ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని క్షణాల్లో మాయం చేస్తాయి. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధిచేసిన నీటిని భూగర్భ జలంగా మార్చేస్తాయి. మురుగునీటి నిల్వ, దుర్వాసన తదితర సమస్యలకు మ్యాజిక్ డ్రెయిన్లు చక్కటి పరిష్కార మార్గం. సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్లకు 80 శాతం నిర్మాణ వ్యయం కూడా ఆదా అవుతుంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పారిశుధ్యాన్ని ఈ మ్యాజిక్ డ్రెయిన్లు పెంపొందిస్తాయి. ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పవన్‌కల్యాణ్ భవిష్యత్తులోనూ ఇలాంటి ముందుచూపుతో కూడిన వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నా’ అని సింధు వీడియోలో పేర్కొన్నారు.