గంగ కోసం గణనాథుడి నిరీక్షణ!
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:57 AM
గంగ కోసం నిరీక్షిస్తున్న గణనాథుడి విగ్రహాలివి. చవితినాడు వివిధ మండపాల్లో పూజలందుకుని నిమజ్జనానికి తరలివచ్చిన వినాయకుడికి ‘అమ్మ’ ఆదరవు కరవైంది. ఒకవైపు రాష్ట్రంలో రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి.
పుట్లూరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): గంగ కోసం నిరీక్షిస్తున్న గణనాథుడి విగ్రహాలివి. చవితినాడు వివిధ మండపాల్లో పూజలందుకుని నిమజ్జనానికి తరలివచ్చిన వినాయకుడికి ‘అమ్మ’ ఆదరవు కరవైంది. ఒకవైపు రాష్ట్రంలో రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. అయినా, మరోవైపు అనంతపురం జిల్లాలో పరిస్థితి వేరు. జిల్లాలోని పుట్లూరు మండల కేంద్రంలోని చెరువులో చుక్కనీరు లేదు. దీంతో ఈ నెల 16న నిమజ్జనానికి తీసుకొచ్చి చెరువులో వదిలేసిన వినాయక విగ్రహాలు బుధవారం కూడా ఇలా నీటి కోసం నిరీక్షిస్తూ కనిపించాయి. గంగమ్మ కరుణించి గణేశుడిని తనలో కలుపుకోనే వరకూ ఈ విగ్రహాలు ఇలా ఉండాల్సిందే. ప్రతిఏటా పుట్లూరు చెరువుకు తుంగభద్ర ఎగువకాలువ (హెచ్చెల్సీ) నుంచి అరకొరగానైనా నీరు వచ్చేది. దీనికితోడు వర్షపునీరు చేరడంతో చెరువు నిండేది. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో హెచ్చెల్సీ నీరు రాలేదు. వర్షాలు కూడా లేవు. వెరసి చెరువు వట్టిపోయింది. ఈ ప్రభావం సాగు, తాగునీటిపై పడుతోంది. పశువులకు సైతం నీరు దొరకని దుస్థితి. ఈ పరిస్థితుల్లో స్వామివారిని ఎక్కడ నిమజ్జనం చేయగలమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.