Share News

అంధత్వాన్ని వెనక్కి నెట్టి.. ఆత్మవిశ్వాసంతో విజయం

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:48 AM

ఆత్మవిశ్వాసం ముందు అంధత్వం చిన్నబోయింది. ప్రమాదంలో కంటి చూపు కోల్పోయి.. కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకుంటూ విద్యాభ్యాసం కొనసాగించాడు. గెజిటెడ్‌ ఆఫీసర్‌ కావాలనే లక్ష్యంతో ముందుకుసాగిన ఆ యువకుడు గ్రూప్‌ - 2 ఫలితాల్లో విజయం సాధించి జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఎంపికయ్యాడు. అంధత్వాన్ని వెనక్కి నెట్టి.. ఆత్మవిశ్వాసంతో పలువురికి ఆదర్శంగా నిలిచాడు చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు శివరామదుర్గాపురం(సాలిపేట)కు చెందిన నందం నాగరాజు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ హెచ్‌వోడీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరనున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

అంధత్వాన్ని వెనక్కి నెట్టి..  ఆత్మవిశ్వాసంతో విజయం

-గ్రూప్‌-2లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికైన నందం నాగరాజు

-ప్రమాదంలో కంటి చూపు దూరమైనా సడలని ఆత్మవిశ్వాసం

-పదవ తరగతి నుంచే 75 శాతంపైగా ఉతీర్ణత సాధిస్తూ ముందుకు..

-గెజిటెడ్‌ ఆఫీసర్‌ కావాలన్నదే అంతిమ లక్ష్యం

ఆత్మవిశ్వాసం ముందు అంధత్వం చిన్నబోయింది. ప్రమాదంలో కంటి చూపు కోల్పోయి.. కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకుంటూ విద్యాభ్యాసం కొనసాగించాడు. గెజిటెడ్‌ ఆఫీసర్‌ కావాలనే లక్ష్యంతో ముందుకుసాగిన ఆ యువకుడు గ్రూప్‌ - 2 ఫలితాల్లో విజయం సాధించి జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఎంపికయ్యాడు. అంధత్వాన్ని వెనక్కి నెట్టి.. ఆత్మవిశ్వాసంతో పలువురికి ఆదర్శంగా నిలిచాడు చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు శివరామదుర్గాపురం(సాలిపేట)కు చెందిన నందం నాగరాజు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ హెచ్‌వోడీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరనున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

(ఆంధ్రజ్యోతి-చల్లపల్లి):

జీవితాన్ని తలకిందులు చేసిన రోడ్డు ప్రమాదం

2010లో హైదరాబాద్‌లో జరిగిన బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజు కంటి చూపును కోల్పోయాడు. అప్పుడు చల్లపల్లి రాజా హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఒక కంటికి మూడు సార్లు శస్త్రచికిత్స చేసినా కన్ను తిరిగిరాలేదు. మరో కంటిచూపు సైతం క్రమేపీ తగ్గిపోయింది. ఆ రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఐదేళ్లు ఇంటి పట్టునే ఉండిపోయిన నాగరాజు కంటిచూపు పోయిందనే బాధను దిగమింగుకుని 2015లో ఒంగోలులోని బ్లైండ్‌ హాస్టల్‌లో చేరాడు. అక్కడే ఉంటూ 78 శాతం మార్కులతో పదవ తరగతి పాసైయ్యాడు. 86 శాతంతో ఇంటర్మీడియట్‌, 80 శాతంతో డిగ్రీ, 75 శాతంతో ఎంఏ పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్‌లో కళాశాల ఫస్టు రావడంతో 2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ప్రతిభా అవార్డు, ల్యాప్‌టాప్‌, గోల్డ్‌మెడల్‌, రూ.20వేల నగదు అందుకున్నాడు. 2022లో ఎంఏ చదువుతూ పోటీ పరీక్షలు రాయటం మొదలుపెట్టాడు. గ్రూప్‌-2 రాసేందుకు ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకున్నాడు. విజయవాడ సిద్థార్ధ మహిళా కళాశాలలో స్ర్కైబ్‌(సహాయకుడు) సహాయంతో గ్రూప్‌-2 పరీక్ష రాశాడు.

చూపు లేకున్నా సడలని ఆత్మవిశ్వాసం

కంటిచూపు లేకున్నా నాగరాజులో ఆత్మవిశ్వాసం ఏమాత్రం సడలలేదు. అధికారి కావాలన్న లక్ష్యమే అతన్ని ముందుకు నడిపించింది. సబ్జెక్టులను రికార్డ్‌ చేసుకుని వినటం, మొబైల్‌ ఫోన్‌లో ఆన్‌లైన్‌ పాఠాలు వినటం ద్వారా సబ్జెక్టును అవపోసన పట్టాడు. హిందూపురానికి చెందిన విజన్‌ త్రూ ఇయర్స్‌ సంస్థ ఆడియో రికార్డ్‌ చేసి ఇచ్చేవారు. ఉన్నత విద్యాభ్యాసంలో ఇవీ ఎంతగానో ఉపయోపడ్డాయి.

అండగా నిలిచిన తల్లి

చిన్న వయసులోనే కంటిచూపు కోల్పోయిన కుమారుడికి తల్లి నందం వెంకటేశ్వరమ్మ అండగా నిలిచింది. సాలిపేట ఎంపీయూపీ పాఠశాలలో ఆమె వంట చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. తండ్రి మోహనరావు 2018లో విద్యుత ప్రమాదంలో మరణించాడు. నాగరాజుకు అక్క, తమ్ముడు ఉన్నారు. తమ్ముడు చదువు మానేసి బేకరీలో పనికి వెళ్తున్నాడు. అక్కకు వివాహం చేశారు. తండ్రి మరణించినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రన్న బీమా ద్వారా వచ్చిన రూ.5 లక్షలు ఆర్థిక భరోసాను కల్పించాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే రూ.6వేల పింఛను, తల్లి కుకింగ్‌ ఏజెన్సీ ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. కుమారుడు గ్రూప్‌-2లో ఉద్యోగం సాధించటంతో తమ కష్టానికి ఫలితం లభించిందని తల్లి వెంకటేశ్వరమ్మ సంతోషం వ్యక్తం చేశారు.

వారి సహాయం మరిచిపోలేను : నాగరాజు

ఉన్నత చదువుల నుంచి నేటి గ్రూప్‌-2 పరీక్షల్లో విజయం సాధించే వరకూ ఇద్దరి సహాయం మరచిపోలేనిది. ఒంగోలుకు చెందిన విశ్రాంత బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి జి.నారాయణరావు, లక్ష్మి దంపతులు ఆర్థికంగా సహకరించటంతోపాటు పాఠాలు రికార్డ్‌ చేసి ఇచ్చేవారు. అలాగే విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త దుర్గాప్రసాద్‌ ఆర్థిక సహకారం అందించారు. గెజిటెడ్‌ ఆఫీసర్‌ కావాలన్నదే తన లక్ష్యం. జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే, భవిష్యత్తులో మళ్లీ పరీక్షలకు సిద్ధమై అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తా. పరీక్షల సమయంలో సహాయకులుగా బాగా చదువుకున్న వ్యక్తులు ఉంటే మరింతగా మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం దివ్యాంగుల ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థికంగా సహకారం అందించి ప్రోత్సహించాలి.

Updated Date - Feb 06 , 2026 | 12:48 AM