ప్రక్షాళన!
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:19 AM
జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కార్యాలయంలో ఎట్టకేలకు ప్రక్షాళన దిశగా అడుగులు పడ్డాయి. ఇంతకాలంగా కొందరు అధికారులు తమకు అనుకూలమైన ప్రత్యేక కోటరీని ఏర్పాటు చేసుకుని వారి చిత్తానుసారంగా సాగించిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇన్‌చార్జి డీపీవోను, కార్యాలయ ఏవోను ఒకే రోజున బదిలీ చేశారు. వారి స్థానంలో వేరే అధికారులను నియమించారు. ఈ మార్పుతోనైనా డీపీవో కార్యాలయంలో పాలన గాడిన పడుతుందా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది.
- డీపీవో కార్యాలయంపై ఉన్నతాధికారుల దృష్టి
- కార్యాలయం ఏవోపై బదిలీ వేటు
- ఇన్‌చార్జి డీపీవో బాధ్యతల నుంచి అరుణ తొలగింపు
- నూతన ఇన్‌చార్జి డీపీవోగా డ్వామా పీడీ శివప్రసాద్ నియామకం
- అధికారుల చర్యలతో పాలన గాడినపడేనా!
జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కార్యాలయంలో ఎట్టకేలకు ప్రక్షాళన దిశగా అడుగులు పడ్డాయి. ఇంతకాలంగా కొందరు అధికారులు తమకు అనుకూలమైన ప్రత్యేక కోటరీని ఏర్పాటు చేసుకుని వారి చిత్తానుసారంగా సాగించిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇన్‌చార్జి డీపీవోను, కార్యాలయ ఏవోను ఒకే రోజున బదిలీ చేశారు. వారి స్థానంలో వేరే అధికారులను నియమించారు. ఈ మార్పుతోనైనా డీపీవో కార్యాలయంలో పాలన గాడిన పడుతుందా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కార్యాలయంలో ప్రక్షాళన ప్రారంభమైంది. ఇప్పటివరకు ఇన్‌చార్జి డీపీవోగా ఉన్న అరుణను ఆ బాధ్యతల నుంచి తప్పించి, డ్వామా పీడీ శివప్రసాద్‌ను ఇన్‌చార్జి డీపీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీపీవో కార్యాలయ ఏవోగా పనిచేస్తున్న సీతారామయ్యను గుడివాడ డీఎల్‌పీవో కార్యాలయ ఏవోగా బదిలీ చేశారు. గుడివాడ డీఎల్‌పీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న శివరామకృష్ణను డీపీవో కార్యాలయ ఏవోగా బదిలీ చేశారు. ఒకే రోజు ఇన్‌చార్జి డీపీవోను, కార్యాలయ ఏవోను మార్చివేయడంతో ఉన్నతాధికా రులు డీపీవో కార్యాలయంలో పరిపాలనా వ్యవహారాల్లో జరుగుతున్న పరిణామాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నారని పంచాయతీ సెక్రటరీలు చెప్పుకుంటున్నారు.
ఎక్కడికక్కడే కోటరీ!
గత కొంతకాలంగా డీపీవో కార్యాలయంలో అధికారులు తమకు అనుకూలమైన ఉద్యోగులతో ప్రత్యేక కోటరీగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కోటరీ ద్వారానే పరిపాలన మొత్తం కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. కోటి రూపాయలకుపైగా ఆదాయం వచ్చే పంచాయతీల్లో పని చేస్తున్న వారు తమ స్థానాలకు ఇబ్బంది లేకుండా, తాము ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న పంచాయతీల్లో వేరెవరినీ నియమించకుండా డీపీవో కార్యాలయ అధికారులను మచ్చిక చేసుకుని తమ హవాను కొనసాగిస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు చెప్పుకుంటున్నారు. ఏదైనా పంచాయతీలో చిన్నపాటి లోటు జరిగితే డీపీవో కార్యాలయ అధికారులు ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నారని, శాఖాపరమైన చర్యలకు గురవుతారని, ఉద్యోగుల్లో భయాన్ని కలిగించడం వంటి పనులు చేసేవారని తెలిసింది. ఎంతోకొంత ముట్టచెబితే వ్యవహారం సీరియస్ కాకుండా చూసుకుంటామని తెరవెనుక బేరాలు పెట్టేవారని సమాచారం. దీంతో డీపీవో కార్యాలయం నుంచి ఎప్పుడు, ఎలాంటి ఫోన్లు వస్తాయోననే భయంతో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు వణికిపోయేవారు.
పంపకాల్లో తేడాలొచ్చి..
ఇటీవల కాలంలో గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులకు పదోన్నతులు ఇచ్చి బదిలీలు చేశారు. ఆ తర్వాత మళ్లీ రెండో విడత పదోన్నతుల విషయం తెరపైకి తేవడంతో ఇటీవలనే పలువురికి బదిలీలు జరిగాయని, వారు ఇంకా ఆ పంచాయతీల్లో కుదుట పడలేదని, మళ్లీ మరికొందరికి పదోన్నతులు ఇచ్చి బదిలీలు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, పదోన్నతులు ఇచ్చి తీరతామని మరికొందరు అధికారులు పట్టుబట్టారు. పదోన్నతులు ఇచ్చే సమయంలో కొందరు అధికారులు తమ కోటరీ ద్వారా నగదు వసూలు చేయడం, ఈ నగదు పంపకాల్లో తేడాలు వచ్చి డీపీవో కార్యాలయ అధికారులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకున్నట్లు సమాచారం.
ఉన్నతాధికారులకు వాటాలు ఇవ్వాలంటూ వసూళ్లు!
పదోన్నతుల్లో ఉన్నతాధికారులకు సైతం వాటాలు ఇవ్వాలని కొందరు అధికారులు చెప్పి మరీ వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. వసూలు చేసిన నగదు నుంచి తమ వాటాలు తమకు ఇవ్వాల్సిందేనని మరికొందరు పట్టుదలకు పోవడంతో డీపీవో కార్యాలయం గుట్టంతా బయటకు పొక్కినట్టు సమాచారం. దీంతో తమకు అనుకూలంగా లేని అధికారులను ఎలాగైనా బదిలీ చేయించాలని అధికారులు ఎవరికి వారు పంతాలకు పోవడంతో వివాదాలు ముదిరి పాకానపడ్డాయి. దీంతో ఈ విషయంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి వివరాలు సేకరించారు. డీపీవో కార్యాలయంలో కొట్లాడుకుంటున్న అధికారులను ఆ కార్యాలయం నుంచి సాగనంపడం విశేషం. ఎట్టకేలకు డీపీవో కార్యాలయాన్ని కొంతమేర ప్రక్షాళన చేయడంతో తమపై వివిధ రూపాల్లో ఒత్తిడి తగ్గి, ఇక నుంచి అయినా పాలన సక్రమంగా సాగుతుందని పంచాయతీ కార్యదర్శులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.