నేటి నుంచి కందుల కొనుగోలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:06 AM
ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన కందులను కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ సంస్థ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది.
దళారులకు అమ్ముకోవద్దు - మార్క్‌ఫెడ్ డీఎం రాజు
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన కందులను కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ సంస్థ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. రెండు నెలల క్రితమే రైతుల నుంచి కందులను ఈ సంస్థ ద్వారా కొనడానికి చర్యలు తీసుకోవలసి ఉన్నా... వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. రైతులు తమ అవసరాల కోసం ఇప్పటి దాకా వ్యాపారులకు అమ్ముకుని నష్టపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో కందుల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన ఆఫ్ ఇండియా.. మార్క్‌ఫెడ్ సంస్థకు ఆదేశాలు జారీ చేసిందని మార్క్‌ఫెడ్ మేనేజర్ రాజు విలేకరులకు తెలిపారు. కర్నూలు జిల్లాలో 25,875 టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, ఇందుకు సంబంధించి రైతుల నుంచి కందుల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మంగళవారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో జిల్లా మార్కెటింగ్ సొసైటీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటానికి రూ.8వేలు చెల్లించేందుకు చర్యలు చేపట్టామని డీఎం రాజు తెలిపారు. కేంద్రం క్వింటం కందులకు రూ.8వేలను మద్దతు ధరగా ప్రకటించిందని, రైతులు తొందరపడి దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని ఆయన తెలిపారు. మట్టి, చెత్త, తడి గింజలు లేకుండా కందులు పరిశుభ్రంగా ఉండాలని, కొనుగోలు చేసిన కందులకు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని డీఎం రాజు తెలిపారు.