ఆగని పులి పంజా
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:59 AM
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను పెద్ద పు హడలెత్తిస్తోంది. ఐదు రోజుల వ్యవధిలో పది పశువులను చంపింది.
మరో మూడు పశువులు బలి
హడలెత్తుతున్న కొయ్యలగూడెం ఏజెన్సీ వాసులు
డిప్పకాయలపాడులోని జొన్నతోటలో పులి తిష్ట
డ్రోన్‌తో గాలించి పులి జాడ గుర్తింపు
పట్టుకునేందుకు బోన్లు సిద్ధం చేసిన అటవీ అధికారులు
కొయ్యలగూడెం/ బుట్టాయగూడెం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను పెద్ద పు హడలెత్తిస్తోంది. ఐదు రోజుల వ్యవధిలో పది పశువులను చంపింది. తాజాగా.. ఆదివారం తెల్లవారుజామున బుట్టాయగూడెం మండలం రావిగూడెంలో తెల్లం రవి అనే గిరిజనుడికి చెందిన గేదె దూడను చంపేసింది. ఉదయాన్నే రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వడంతో పులి అడుగు జాడలను బట్టి గాలించారు. డ్రోన్ కెమెరాతో గాలించారు. డ్రోన్ శబ్దంతో పులి పెద్దగా గాండ్రించడంతో సిబ్బంది, రైతులు పరుగులు తీశారు. డిప్పకాయలపాడులోని ఒక రైతుకు చెందిన మొక్కజొన్న తోటలో తిష్ట వేసి ఉన్నట్టు గుర్తించారు. ఆ తోట చుట్టూ ముళ్లకంచె ఉండటంతో బయటకు వచ్చే అవకాశం లేక అక్కడే ఉంది. ఆదివారం రాత్రి వరకు పులి కదలికలను అధికారులు పరిశీలించారు. తోట చుట్టూ ట్రాప్ కెమెరాలను అమర్చారు. పులిని బంధించేందుకు అధికారులు బోనులను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, పులిని బోనులో బంధించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.