Share News

కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.7 లక్షలు డిమాండ్‌

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:43 AM

వైఎసార్‌ కడప జిల్లా పులివెందుల సీఐ ఎన్వీ రమణ, సింహాద్రిపురం ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ ఏసీబీకి పట్టుబడ్డారు.

కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.7 లక్షలు డిమాండ్‌

  • రూ.1.50 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పులివెందుల సీఐ, సింహాద్రిపురం ఎస్‌ఐ

సింహాద్రిపురం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): వైఎసార్‌ కడప జిల్లా పులివెందుల సీఐ ఎన్వీ రమణ, సింహాద్రిపురం ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. సోమవారం సింహాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌లో రూ.1.50 లక్షల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్‌ఐ పట్టుబడ్డారు. కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు... అనంతపురానికి చెందిన బ్రహ్మం సత్యసాయి జిల్లా కదిరిలోని వెంకటబాలాజీ ఆటో కన్సల్టెన్సీలో గతేడాది డిసెంబరులో బైక్‌ కొనుగోలు చేశాడు. తర్వాత బిహార్‌కు చెందిన దిలీప్‌కు విక్రయించాడు. అయితే దిలీప్‌ చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతూ ఈ బైకును ఉపయోగించేవాడు. దీంతో సింహాద్రిపురం ఎస్‌ఐ అనిల్‌కుమార్‌, పులివెందుల రూరల్‌ సీఐ ఎన్వీ రమణ బ్రహ్మంను పిలిపించి దిలీప్‌ చోరీల్లో నీకూ భాగం ఉందని బెదిరించారు. కేసు పెడతామంటూ బ్రహ్మాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. రూ.7 లక్షలు ఇస్తే కేసు నమోదు చేయబోమని చెప్పగా.. అంత చెల్లించలేననడంతో చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఎస్‌ఐ మొదట రూ.50 వేలు తీసుకున్నాడు. మిగతా రూ.1.50 లక్షలు సోమవారం తీసుకుని రావాలని బ్రహ్మాన్ని ఆదేశించారు. దీనిపై బాధితుడు కడప ఏసీబీ డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. సోమవారం సింహాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ నగదు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అదే సమయంలో లింగాల పోలీస్‌ స్టేషన్‌ నుంచి సింహాద్రిపురం బయలుదేరిన సీఐ రమణను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 04:44 AM