Share News

దర్యాప్తు అధికారి చెప్పినట్టు నడుచుకోండి

ABN , Publish Date - May 02 , 2026 | 04:45 AM

సోషల్‌ మీడియాలో హేయమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలతో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు అధికారి ఆదేశాలకు అనుగుణంగా ...

దర్యాప్తు అధికారి చెప్పినట్టు నడుచుకోండి

  • పూడి శ్రీహరికి హైకోర్టు ఆదేశం

  • బీఎన్‌ఎస్ఎస్ 35(3) ప్రకారం నోటీసులుఇవ్వాలని గుంటూరు పోలీసులకు ఉత్తర్వులు

అమరావతి/గుంటూరు, మే 1(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో హేయమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలతో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు అధికారి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని వైసీపీ సోషల్‌ మీడియా జనరల్‌ సెక్రెటరీ పూడి శ్రీహరిని హైకోర్టు ఆదేశించింది. శ్రీహరిపై నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్షకు వీలున్నవేనని, బీఎన్‌ఎస్ఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా కొత్తపేట పోలీసులు నమోదు చేసిన కేసులో శ్రీహరిని ఇప్పటికే అరెస్ట్‌ చేసి, మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. సీఎం చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. పూడి శ్రీహరి హైకోర్టులో 2 క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు శుక్రవారం విచారణకు రాగా.. శ్రీహరి తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘బీఎన్‌ఎ్‌సఎస్‌ 35(3) మేరకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒకే ఘటనపై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం’’ అని తెలిపారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. పిటిషనర్‌ శ్రీహరి దర్యాప్తునకు సహకరించడం లేదని, నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా తాడేపల్లి, అనకాపల్లి చిరునామాల్లో పిటిషనర్‌ అందుబాటులో లేరని తెలిపారు. మరోవైపు పూడి శ్రీహరికి గుంటూరు కొత్తపేట పోలీసులు మేజిస్ట్రేట్‌ సూచనల మేరకు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం ఆయన్ను గుంటూరులోని నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కాగా, హైకోర్టు ఇచ్చిన మౌఖిక ఆదేశాలను శ్రీహరి తరఫు న్యాయవాది అఫిడవిట్‌ రూపంలో కోర్టుకు సమర్పించారు. దీంతో కొత్తపేట, నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఆయా కేసుల్లో 41ఏ నోటీసులు ఇవ్వాలని మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. దీంతో పూడి శ్రీహరికి కొత్తపేట పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు.

Updated Date - May 02 , 2026 | 04:45 AM