Share News

శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్‌

ABN , Publish Date - May 01 , 2026 | 03:46 AM

వైసీపీ సోషల్‌ మీడియా కార్యదర్శి, జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (సీపీఆర్వో)గా పనిచేసిన పూడి శ్రీహరికి కుప్పం కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది.

శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్‌

  • వెంటనే అదుపులోకి తీసుకున్న గుంటూరు పోలీసులు

కుప్పం, గుంటూరు, అమరావతి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్‌ మీడియా కార్యదర్శి, జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (సీపీఆర్వో)గా పనిచేసిన పూడి శ్రీహరికి కుప్పం కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. బెంగళూరులో ఉన్న ఆయనను పోలీసులు బుధవారం అరెస్టు చేసి కుప్పం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో శ్రీహరిని రెండోసారి అరెస్టు చేసిన పోలీసులు ఆయనను రోజంతా విచారించారు. అనంతరం గురువారం కుప్పం కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. అయితే అప్పటికే కోర్టు బయట వేచి ఉన్న గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు శ్రీహరిని వెంటనే అదుపులోకి తీసున్నారు. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంపై గుంటూరులో నమోదైన కేసులో శ్రీహరికి అక్కడికక్కడే నోటీసులిచ్చి అరెస్టు చేశారు. గురువారం రాత్రి 11 గంటల తర్వాత గుంటూరులోని కొత్తపేట పోలీస్‌ స్ట్టేషన్‌కు తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనను కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

హైకోర్టులో శ్రీహరి పిటిషన్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలోఅనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీసులు నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ పూడి శ్రీహరి హైకోర్టులో రెండు క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే కుప్పం పోలీసులు అరెస్ట్‌ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒకే ఘటనపై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు.

Updated Date - May 01 , 2026 | 03:46 AM