ప్రజల భద్రతే ముఖ్యం
ABN , Publish Date - Sep 07 , 2026 | 11:50 PM
ప్రజల భద్రతే ముఖ్యమని డీఎస్పీ వెం కటరమణ అన్నారు.
లైసెన్సు లేకుండా క్రాకర్స్
విక్రయిస్తే కఠిన చర్యలు
తప్పుడు ప్రచారాలపై ఉక్కుపాదం
డీఎస్పీ వెంకటరమణ
ఆదోని, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాబోయే పండగల నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ ముం దస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని, ఇందు లో ప్రజల భద్రతే ముఖ్యమని డీఎస్పీ వెం కటరమణ అన్నారు. సోమవారం టూటౌన్ పోలీ్‌సస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పండుగల సీజన్‌లో బాణసంచా (క్రాకర్స్) వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి లైసెన్సు, ఫైర్ సేఫ్టీ అనుమతి, పోలీసు అనుమతి ఉండాలన్నారు. లైసెన్స్ ఉంటేనే విక్రయించాలని, అనుమతులు లేకుండా ఇళ్లల్లో, గోడౌన్లలో నిల్వ ఉంచినా, రోడ్ల పక్కన షాపుల్లో అమ్మినా సరుకును సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిర్వాహకులపై ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం, ఇందులో రాజీ లేదని డీఎస్పీ హెచ్చరించారు. అనుమతి ఉన్న షాపుల వారు కూడా భద్రతా ప్రమాణాలు పాటించాలని, మంటలను ఆర్పే పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
తప్పుడు ప్రచారాలు చేయొద్దు
సోషల్ మీడియా దుర్వినియోగంపై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోకుండా, కేవలం వ్యూస్ కోసం ఏది పడితే అది వైరల్ చేయడం మానుకోవాలన్నారు.
వినాయక మండపాల ఏర్పాటుకు
ఆన్‌లైన్ నమోదు
వినాయక పండుగ మండపాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసి అనుమతి తీసుకోవాలని తెలిపారు. నిబంధనల మేరకే మండపాలు, నిమజ్జనం నిర్వహించాలన్నారు. అలాగే పట్టణంలో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించినా ఏదైనా నేర సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో సీఐలు రాజశేఖర్‌రెడ్డి, రామలింగమయ్యలు పాల్గొన్నారు.