Health Department: అంటువ్యాధుల గుర్తింపులో ప్రజల భాగస్వామ్యం
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:00 AM
అంటువ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ బుధవారం తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ వెబ్ లింక్‌లో ఫిర్యాదు
ఆర్యోశాఖ కమిషనర్ వీరపాండియన్
అమరావతి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): అంటువ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ బుధవారం తెలిపారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వ్యాధి నిఘా కార్యక్రమం (డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్) కింద రూపొందించిన సమగ్ర ఆరోగ్య సమాచార వేదిక (ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్-ఐహెచ్‌ఐపీ) వెబ్ లింక్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. పరిసరాల అపరిశుభ్రత, మురుగు నీటి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, తాగునీరు కలుషితం కావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మూకుమ్మడిగా వాంతులు, విరోచనాలు వంటి వ్యాధుల బరినపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ తరహా ఘటనలు క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో పైస్థాయి అధికారులకు చేరడంలో జాప్యం జరుగుతుంది. దీన్ని అధిగమించే చర్యల్లో భాగంగా వ్యాధుల నియంత్రణలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు వీరపాండియన్ వెల్లడించారు. ఇందుకోసం ‘‘ఎంవోహెచ్‌ఎ్‌ఫడబ్ల్యూ.జీవోవీ.ఐన్’’ అనే వెబ్‌లింక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రజలు ఈ వెబ్‌లింక్‌లో నమోదుచేసిన సమాచారం క్షణాల్లోనే ఏఎన్‌ఎం, పీహెచ్‌సీ వైద్యాధికారి, జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులకు చేరుతుందని చెప్పారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకూ వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు చేపడతారని పేర్కొన్నారు. ఈ అవకాశం ద్వారా ప్రజలు అంటువ్యాధుల నివారణలో ప్రభుత్వానికి సహకరించాలని వీరపాండియన్ విజ్ఞప్తి చేశారు.