చేపల చెరువుల తవ్వకాలపై ప్రజాగ్రహం
ABN , Publish Date - May 05 , 2026 | 12:17 AM
మంచినీటి చెరువు, పచ్చని పంట పొలాల మధ్య చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలపై ప్రజలు తిరగబడ్డారు. నందివాడ మండలం పెదలింగాల గ్రామస్థులు, కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామస్థులు వేర్వేరుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. తాగు, సాగు నీటిని కలుషితం చేసే చెరువుల తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ధర్నాచౌక్‌లో ధర్నాకు దిగారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
- మచిలీపట్నం ధర్నా చౌక్‌లో రెండు గ్రామాల ప్రజల ఆందోళన
- పంట పొలాల మధ్య తవ్వుతున్నారని పెదలింగాల గ్రామస్థుల మండిపాటు
- తాగునీటి చెరువు పక్కనే అంటూ విశ్వనాథపల్లి గ్రామస్థుల ధర్నా
- అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపణ
- పైగా మాపైనే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన
- న్యాయం చేయాలని కలెక్టర్‌కు వేడుకోలు
మంచినీటి చెరువు, పచ్చని పంట పొలాల మధ్య చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలపై ప్రజలు తిరగబడ్డారు. నందివాడ మండలం పెదలింగాల గ్రామస్థులు, కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామస్థులు వేర్వేరుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. తాగు, సాగు నీటిని కలుషితం చేసే చెరువుల తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ధర్నాచౌక్‌లో ధర్నాకు దిగారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలపై ప్రజలు కన్నెర్ర చేశారు. నందివాడ మండలం పెదలింగాల, కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు. పంట పొలాలు, తాగునీటి చెరువుల పక్కనే చేపలు, రొయ్యల చెరువులు తవ్వుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చెరువుల తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో ధర్నాకు దిగారు. రెండు గ్రామాల ప్రజలు చేసిన నినాదాలతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని, గ్రామాలను కాపాడాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. పంట పొలాలు, తాగునీటి చెరువుల పక్కనే చెరువులు తవ్వితే వరి పంట సాగు చేసుకునేందుకు అవకాశం ఉండదని, భూగర్భ జలాలు కలుషితమై తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల తవ్వకాలను నిలిపివేయాలని గ్రామస్థులు కోరుతుంటే రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ అధికారులు వాస్తవాలు తెలుసుకోకుండా గ్రామస్థులపైనే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని కలెక్టర్ బాలాజీని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలిసి అర్జీలు అందజేశారు.
పంట పొలాల మధ్య చేపల చెరువు తవ్వకం
నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో చేపల చెరువుల తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ మహిళలు, గ్రామస్థులు పెద్దఎత్తన కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమ గ్రామంలో రెండు వేల మందికిపైగా జనాభా ఉన్నారని, అంతా వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని బతికే వారేనని తెలిపారు. గ్రామంలోని పంట పొలాల మధ్య కొందరు వ్యక్తులు ఇటీవల చేపల చెరువులను తవ్వేందుకు యంత్రాలు తీసుకువచ్చారని చెప్పారు. చుట్టు పక్కల రైతులు అభ్యంతరాలు తెలిపినా చెరువుల తవ్వకాలను ప్రారంభించారన్నారు. గ్రామంలో సార్వా పంటలో ఎకరానికి 40 బస్తాలకు పైగా దిగుబడి వచ్చే పంట పొలాల మధ్య చేపల చెరువులు తవ్వుతుంటే, వరి పంట సాగుకు ఆటంకం ఏర్పడుతుందని, ఈ చెరువుల తవ్వకాలను నిలిపి వేయాలని గ్రామస్థులంతా అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశామని వివరించారు. చేపల చెరువుల సాగు పేరుతో అనుమతులు తీసుకుని, అనంతరం రొయ్యలను సాగు చేస్తున్నారని, ఈ చెరువులలో వాడే మందుల కారణంగా భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆరోపించారు. చుట్టు పక్కల రైతుల అభిప్రాయం తీసుకోకుండా, అధికారులతో మాట్లాడుకుని చెరువుల తవ్వేస్తున్నారని, వీటిని ఆడ్డుకోవాలని గ్రామస్థులు నినాదాలు చేశారు. రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ అధికారులకు విషయం తెలియజేస్తే చూస్తాం, చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. వరి సాగు చేసే పొలాలను ఆక్వా జోన్ పరిధిలోకి మారుస్తూ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. చేపల చెరువులు తవ్వుతున్న విషయం పోలీసులకు చెబితే మూడు రోజుల్లోగా ఏ విషయం తేల్చుకోవాలని, లేకుంటే తమపైనే కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్థులు వాపోయారు. గ్రామంలో పంట పొలాల మధ్య చేపల చెరువులు తవ్వకాలను నిలిపివేయాలని, చెరువులు తవ్వితే గ్రామస్థులంతా వేరే ప్రాంతాలకు వలస పోవాల్సిందేనని, పంట పొలాలను ఆక్వాజోన్ పరిధిలో నుంచి తొలగించాలని, చెరువుల తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.
విశ్వనాథపల్లి గ్రామస్థుల ఆందోళన
కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామస్థులు కలెక్టరేట్‌కు తరలివచ్చి గ్రామ తాగునీటి చెరువుల పక్కనే రొయ్యల చెరువుల తవ్వకాలను నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. గ్రామంలో కరకట్ట పక్కనే పది ఎకరాల్లో రెండు చెరువులు ఉన్నాయని, ఈ చెరువులోని నీటినే తాగునీటికి, గృహ అవసరాల కోసం వాడుకుంటామని చెబుతున్నారు. భూగర్భ జలాలు ఉప్పునీరు కావడంతో సాగునీటి కాల్వల ద్వారా వచ్చిన నీటిని తాగునీటి చెరువుల్లో నింపి, శుద్ధి చేసిన అనంతరం వాడుకుంటామని తెలిపారు. గ్రామంలో నాలుగు వేల మంది జనాభా తాగు నీటి అవసరాల కోసం ఈ చెరువులోని నీరే ప్రధాన ఆధారమని వివరించారు. తాగునీటి చెరువు పక్కనే కొందరు వ్యక్తులు రొయ్యల చెరువులు తవ్వుతున్నారని, ఆ విషయం తహసీల్దార్, అధికారులకు తెలియజేసినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెరువులు తవ్వేవారికే మద్దతుగా ఉంటున్నారని వాపోయారు. సోమవారం చెరువులు తవ్వేందుకు మరిన్ని యంత్రాలు తీసుకువచ్చారని, రెవెన్యూ అధికారులకు ఈ సమాచారం తెలియజేస్తే మేము వేరే ప్రాంతంలో ఉన్నామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో తాగునీటి చెరువు పక్కనే రొయ్యల చెరువుల తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్‌కు విశ్వనాథపల్లి గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు.