సమస్యలపై గళం విప్పిన జనం
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:10 AM
ఏలూరు గ్రీన్ సిటీలో పక్కా రోడ్ల నిర్మాణానికి రూ.1.07 కోట్లు మంజూరు చేస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రకటించారు.
ప్రజా సమస్యలకు పరిష్కార బాట.. నరసన్నపేట, ఏలూరులో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సదస్సులు.. పాల్గొన్న ఎమ్మెల్యేలు బగ్గు, బడేటి, అధికారులు
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహిస్తున్న ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సదస్సులు ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, జిల్లా కేంద్రమైన ఏలూరులో జరిగాయి. నరసన్నపేటలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఏలూరులో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొని, ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. కొన్నింటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు.
గ్రీన్‌సిటీ రోడ్డుకు రూ.1.07 కోట్లు
గ్రీన్‌సిటీకి వచ్చే ఏడాదిలోగా గోదావరి జలాలు
‘అక్షరం అండగా..’ వేదికపై ఎమ్మెల్యే బడేటి హామీ
ఏలూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఏలూరు గ్రీన్ సిటీలో పక్కా రోడ్ల నిర్మాణానికి రూ.1.07 కోట్లు మంజూరు చేస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రకటించారు. త్వరలోనే టెండర్లు పిలిచి రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు 19 డివిజన్ గ్రీన్‌సిటీ పార్కులో ‘ఆంధ్రజ్యోతి’ తాడేపల్లిగూడెం యూనిట్ మేనేజర్ బి.హరిబాబు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన వచ్చింది. స్థానికులు చెప్పిన సమస్యలను ఎమ్మెల్యే నోట్ చేసుకున్నారు. కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం చెప్పారు. మరికొన్నింటిని దశల వారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ‘చాలాచోట్ల కచ్చా డ్రెయిన్ల ద్వారానే మురుగునీరు బయటకు పోయే మార్గాలు వేస్తున్నాం. ఏలూరు నగరంలో కలిసిన విలీన గ్రామాలకు గోదావరి జలాలు అందించే పనిలో భాగంగా గ్రీన్‌సిటీ ప్రాంతానికి ఓవర్‌హెడ్ ట్యాంకు ద్వారా వచ్చే ఏడాదికి పరిశుభ్రమైన నీరందిస్తాం. కాలనీలో వైద్యానికి అర్బన్ హెల్త్ సెంటర్ మంజూరు చేస్తాం. అసాంఘిక కార్యక్రమాల నివారణకు సీసీ కెమెరాలు పెట్టిస్తాం. రోజు విడిచి రోజు పారిశుధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.

పార్కుల అభివృద్ధికి నిధులు లేవని, ప్రజలు కొంత భరిస్తే ప్రత్యేకంగా మీ ప్రాంత అభివృద్ధి బాధ్యత తీసుకుంటా’నని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యుడు ఎస్‌ఎంఆర్ పెదబాబు, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, గ్రీన్‌సిటీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎస్‌ఎన్ రమేష్, టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యప్రసాద్, కార్పొరేటర్ యర్రంశెట్టి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సమస్యా పరిష్కరిస్తా
నరసన్నపేట సదస్సులో ఎమ్మెల్యే బగ్గు
ప్రజల వినతులపై తక్షణ ఆదేశాలు.. పనులు ప్రారంభించిన యంత్రాంగం
శ్రీకాకుళం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆదివారం చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం విజయవంతమైంది. నరసనన్నపేట ఆర్‌అండ్‌బీ అతిథిగృహ ప్రాంగణంలో ఇందిరానగర్, హడ్కో కాలనీ ప్రజలతోపాటు పేట వాసులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు విన్నవించారు. వంశధార కాలువ ఆక్రమణలకు గురవుతున్నదని, వంశధార కాలనీలో రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, శ్మశానానికి సరైన రోడ్డు లేదని, సాగునీటి చెరువుల్లో వ్యర్థాలు వేస్తున్నారని, తాగునీటి సమస్య ఉందని, పాఠశాల భవనం శిధిలావస్థకు చేరుకుందని, గత వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన పార్కును పునరుద్ధరించాలని, రోడ్లు బాగు చేయాలని, జల్‌జీవన్ మిషన్ పనులు చేపట్టాలని.. ఇలా పలు సమస్యలను ఏకరువు పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు చెప్పిన ప్రతి సమస్యనూ నూటికి నూరు శాతం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సత్వరమే పరిష్కరించదగినవాటిపై వేదిక నుంచే అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతంలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని అధికారులకు చెప్పారు. విద్యుత్ దీపాలను, లైన్లను తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. అలాగే చిల్డ్రన్ పార్క్‌ను సకాలంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వంశధార కాలువలో గుర్రపుడెక్క తొలగించే చర్యలు చేపడతామని, శ్మశానానికి రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఇటీవలే తాగునీటి కోసం రూ.1200 కోట్లు మంజూరయ్యాయని, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ వేయిస్తామని చెప్పారు. శిథిలమైన పాఠశాల భవనం స్థానంలో కొత్త భవనం నిర్మిస్తామన్నారు. వంశధార కాలనీలో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేయాలని ఎస్‌ఐను ఆదేశించారు. ఎమ్మెల్యే కుమార్తె, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచి మేనేజర్ ఆర్.సోమశంకరరావు సన్మానించారు.

సాయంత్రం నుంచే పనులు ప్రారంభం
ఇందిరానగర్, హడ్కోకాలనీలో కుమ్మరివీధి తదితర ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు అస్తవ్యస్తంగా ఉండటం.. పగలూ విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉండటాన్ని మహిళలు ‘అక్షరం అండగా..’ సదస్సులో ప్రస్తావించారు. పంచాయతీ ఈవో ఆదేశాల మేరకు సిబ్బంది వీధుల్లో తిరిగి విద్యుత్ లైన్లు సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. కార్యక్రమం నిర్వహించిన కొన్ని గంటల్లోనే పనులు ప్రారంభం కావడంపై ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.