Share News

విస్తృత ప్రజా ప్రయోజనాలే ముఖ్యం

ABN , Publish Date - Mar 05 , 2026 | 03:56 AM

జాతీయ రహదారులు, ఇతర భారీ ప్రాజెక్టుల కోసం చేపట్టే భూసేకరణలో విస్తృత ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన ్యం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది.

విస్తృత ప్రజా ప్రయోజనాలే ముఖ్యం

  • కొద్దిమంది అభ్యంతరాలతో మొత్తం ప్రాజెక్టును నిలిపివేయలేం

  • గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే భూసేకరణ నోటిఫికేషన్లు సక్రమమైనవే

  • పలువురు భూ యజమానుల పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులు, ఇతర భారీ ప్రాజెక్టుల కోసం చేపట్టే భూసేకరణలో విస్తృత ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన ్యం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. భూసేకరణకు మెజార్టీ రైతులు అంగీకరించి, కొందరు అభ్యంతరం లేవనె త్తారనే కారణంతో మొత్తం ప్రాజెక్టును నిలిపివేయలేమని స్పష్టం చేసింది. జాతీయ రహదారుల చట్టం-1956 ప్రకారం భూసేకరణ నోటిఫికేషన్‌లో సర్వే నంబర్లు, విస్తీర్ణం ఉంటే సరిపోతుందని, భూమి యజమానుల పేర్లు ప్రచురించాల్సిన అవసరం లేదని తెలిపింది. చట్టనిబంధనల ప్రకారం రెండు స్థానిక పత్రికల్లో నోటిఫికేషన్‌ ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుచేసింది. పత్రికల సర్క్యులేషన్‌ తక్కువగా ఉందనే కారణంతో నోటిఫికేషన్‌ చెల్లకుండా పోదని వ్యాఖ్యానించింది. చట్టం నిర్దేశించిన గడువులోగా పిటిషనర్లు అభ్యంతరాలు లేవనెత్తలేదని పేర్కొంది. నిపుణుల పరిధిలో ఉండే రోడ్డు అలైన్‌మెంట్‌, ఇతర సాంకేతిక అంశాల్లో న్యాయస్థానాల జోక్యం పరిమితమని తేల్చిచెప్పింది. బెంగుళూరు- మైదుకూరు- అమరావతి హైవే నిర్మాణానికి భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు చట్టనిబంధనలకు లోబడే ఉన్నాయని పేర్కొంటూ పలువురు భూయజమానులు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె. శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు చెప్పారు. బెంగుళూరు- అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో భాగంగా వైఎస్సార్‌ కడప జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఉన్న 47 గ్రామాల్లో 124 కి.మీ. రహదారి కోసం అధికారులు 2023లో భూసేకరణ ప్రకటన ఇచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ పలువురు భూయజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌హెచ్‌ఏఐ తరఫున సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు. వాణిజ్య అవసరాల కోసం భూమి సేకరిస్తున్నామన్న పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదని తెలిపారు. చట్టనిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌ ఇచ్చిన 21 రోజుల్లో పిటిషనర్లు అభ్యంతరాలు లేవనెత్తలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుత మార్కెట్‌ ధర మేరకు పరిహారం చెల్లించాలని మాత్రమే కోరారని నివేదించారు.

Updated Date - Mar 05 , 2026 | 03:56 AM