ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:34 AM
‘పీఆర్సీ చైర్మన్‌ను వెంటనే నియమించాలి. వెంటనే 30 శాతం ఐఆర్ చెల్లించాలి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’ అని..
లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం: పీఆర్టీయూ
విజయవాడ (ధర్నాచౌక్), ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ‘పీఆర్సీ చైర్మన్‌ను వెంటనే నియమించాలి. వెంటనే 30 శాతం ఐఆర్ చెల్లించాలి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’ అని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) రాష్ట్ర నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు సంఘీభావం తెలిపారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.కృష్ణయ్య, ఏఎం గిరిప్రసాద్ మాట్లాడారు. ‘ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ కమిటీ ఏర్పాటు చేసి అమలు చేయాలి. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి ఓపీఎస్ వర్తింపజేయాలి. జీవో 302 పునరుద్ధరించి, జేఎల్స్‌గా పదోన్నతులు కల్పించాలి. మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ఏర్పాటు చేయాలి. జడ్పీ పరిధిలోని ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలను కలెక్టర్ పరిధిలో చేపట్టాలి’ అని వారు డిమాండ్ చేశారు.