Share News

మౌలిక వసతులు కల్పించండి

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:58 PM

మౌలిక వసతులను పక్కాగా సిద్ధం చేయాలని జేసీ నూరుల్‌ ఖమర్‌ ఆదేశించారు.

 మౌలిక వసతులు కల్పించండి
కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జేసీ నూరుల్‌ఖమర్‌

సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలి

జేసీ నూరుల్‌ ఖమర్‌

పోలింగ్‌ కేంద్రాలు, కౌంటింగ్‌

సెంటర్‌ పరిశీలన

ఆదోని, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మౌలిక వసతులను పక్కాగా సిద్ధం చేయాలని జేసీ నూరుల్‌ ఖమర్‌ ఆదేశించారు. స్థానిక మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా శనివారం జేసీ, ఆర్డీవో అరుణాదేవి, కమిషనర్‌ నయూమ్‌అహమ్మద్‌లతో కలిసి పట్టణంలోని పలు పోలింగ్‌ స్టేషన్లు, కౌంటింగ్‌ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా స్థానిక ఆర్ట్స్‌ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్‌ కేంద్రాన్ని అధికారులు సందర్శించారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన కౌంటింగ్‌ హాళ్లు, స్ర్టాంగ్‌ రూమ్‌ల భద్రత, ఓట్ల లెక్కింపు, బల్లల సర్దుబాటు, నిరంతర విద్యుత్‌ సరఫరా, సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ, మీడియా రూమ్‌ తదితర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను అధికారుల బృందం తనిఖీ చేసింది. ఎన్నికల రోజున ఓటర్లు ఇబ్బంది పడకుండా క్యూలైన్ల నిర్వహణ, నీడ వసతి, సురక్షిత తాగునీరు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక ర్యాంపుల ఏర్పాటు వంటి మౌలిక వసతులను పక్కాగా సిద్ధం చేయాలని కమిషనర్‌ నయూమ్‌అహమ్మద్‌ను జేసీ ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఏర్పాట్లన్నీ సకాలంలో పూర్తి చేయాలని, అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని జేసీ సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 11:58 PM