మళ్లీ చిన్ని వర్సెస్ కొలికపూడి
ABN , Publish Date - Mar 03 , 2026 | 05:02 AM
టీడీపీ అధిష్ఠానం జోక్యం చేసుకున్నా.. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు.
‘నెమలి’ బ్రహ్మోత్సవాల్లో ప్రొటోకాల్ రగడ
ఎంపీ చేతిలో నుంచి పట్టువస్ర్తాలను లాక్కున్న కొలికపూడి
దైవ సన్నిధిలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం
విజయవాడ/గంపలగూడెం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధిష్ఠానం జోక్యం చేసుకున్నా.. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. తాజాగా నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉభయుల నడుమ ప్రొటోకాల్ చిచ్చు ఏర్పడింది. ఎంపీకి దేవస్థాన పురోహితులు అందచేసిన పట్టు వస్ర్తాలను ఎమ్మెల్యే బలవంతంగా లాక్కోవడం విస్మయపరిచింది. ఎమ్మెల్యే ప్రవర్తనకు అశే ష భక్తులు నివ్వెరపోయారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో సోమవారం రాత్రి వేణుగోపాలస్వామి కల్యాణానికి ఎంపీ కేశినేని సతీసమేతంగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడి కూడా సతీసమేతంగా వచ్చారు. స్వామి కల్యాణ మండపానికి ఎదురుగా సుమారు 100 అడుగుల దూరంలో రుక్ష్మిణీ సత్యభామ విగ్రహాల వద్ద పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు.. స్వామికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలను చిన్ని దంపతులకు అందజేశారు. వారికి అభిముఖంగా రెండో వైపు ఉన్న ఎమ్మెల్యే కొలికిపూడి.. తనకు కూడా ఇవ్వాలంటూ రెండు చేతులూ ముందుకు చాచారు. దీంతో పురోహితులు ఇబ్బంది పడ్డారు. పట్టు వస్ర్తాలు ఒకరికే ఇస్తారు కాబట్టి.. ఎమ్మెల్యే దంపతులకు ఈవో సంధ్య ముత్యాల తలంబ్రాలు అందించారు. ఎంపీకి పట్టు వస్త్రాలివ్వడం నచ్చని కొలికపూడి వెంటనే ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలు బలవంతంగా లాగేసుకుని తన తలపై పెట్టుకుని కల్యాణ మండపం వద్దకు బయల్దేరారు. ఇదేం పని అంటూ ఎంపీ వర్గీయులు ఆయన్నుంచి పట్టు వస్ర్తాలను తీసుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఉభయ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో తోపులాట వరకు వెళ్లింది. అయితే అక్కడున్న పోలీసులు వెంటనే కలుగజేసుకుని సర్దిచెప్పడంతో వివాదం చల్లారింది. తన వర్గీయులను ఎంపీ శివనాథ్ వారించారు. కల్యాణ మండపంలో ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు, వెనుక వరుసలో ఎంపీ దంపతులు కూర్చున్నారు. స్వామి కల్యాణంలో కన్యాదానం చేయడానికి 250 మంది దంపతులు వచ్చారు. చిన్ని దంపతులు వారి మధ్యలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కల్యాణానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల నుంచి పది వేల మందికి పైగా హాజరయ్యారు. మరోవైపు.. పట్టు వస్ర్తాల వివాదం నేపథ్యంలో రెండు వర్గాల నడుమ గొడవలు జరుగుతాయేమోనన్న ఆందోళనతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.