సమస్యలపై నిలదీత
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:31 AM
జిల్లా పరిషత సమావేశంలో సభ్యులు గళం విప్పారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న, మినుము కొనాలని డిమాండ్ చేశారు. తాగునీరు కలుషతమవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యథేచ్ఛగా ఇసుక, మట్టి తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సభ్యులకు 36 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకపోవడం సమంజసమేనా అని నిలదీశారు.
- జడ్పీ సమావేశంలో గళం విప్పిన సభ్యులు
- పంటలకు గిట్టుబాటు ధర అందడంలేదని ఆవేదన
- మొక్కజొన్న, మినుము కొనుగోలు కేంద్రాలు పెట్టాలని డిమాండ్
- తాగునీటి సమస్యలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం
- ఇసుక, మట్టి తవ్వుకుపోతున్నారని ఆరోపణలు
- 36 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వడంలేదని మండిపాటు
- సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలు
- జడ్పీ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం
జిల్లా పరిషత సమావేశంలో సభ్యులు గళం విప్పారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న, మినుము కొనాలని డిమాండ్ చేశారు. తాగునీరు కలుషతమవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యథేచ్ఛగా ఇసుక, మట్టి తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సభ్యులకు 36 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకపోవడం సమంజసమేనా అని నిలదీశారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లా పరిషత ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను మహిళలకే కేటాయించనున్నట్లు జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షతన గురువారు జిల్లా పరిషత కన్వెన్షన్ హాలులో గురువారం జరిగింది. తొలుత జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులతో కలిసి షాపింగ్ కాంప్లెక్స్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఉప్పాల హారిక మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో జడ్పీ నిధులు రూ.2 కోట్లతో జడ్పీ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మాణం చేశామన్నారు. ఈ షాఫులను త్వరలో మహిళలకే కేటాయించడం జరుగుతుందన్నారు. త్వరలో జెడ్పీ కన్వెన్షన్‌హాలును వేలం ద్వారా కాంట్రాక్టుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. జడ్పీకి స్టాంప్ డ్యూటీ రూ.23 కోట్లను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారని దీంతో అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని వివరించారు. అనంతరం ఆయా శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు.
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఏదీ ?
ఉమ్మడి జిల్లాలో ఈ రబీ సీజన్‌లో 65 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు జరిగిందని, కేంద్ర ప్రభుత్వం క్వింటా మొక్కజొన్నకు రూ.2400 మద్దతు ధరగా ప్రకటించిందని, కానీ రూ.1700లకే కొనుగోలు చేస్తున్నారని సభ్యులు పోడియం ఎదుటకు వచ్చి ఆందోళన చేశారు. మొక్కజొన్న, మినుము పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా, ఇంతవరకు అవి ప్రారంభం కాలేదన్నారు. ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే పోటీ పెరిగి బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్న, మినుము ధరలు పెరుగుతాయన్నారు ఈ సందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం మొక్కజొన్న, మినుము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిందని, అయితే నిధులు విడుదలలో జాప్యం జరగడంతో ఈ కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారం భించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న, మినుము కొనుగోలు చేయాలని సభ్యులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గతేడాది వచ్చిన మొంథా, దిత్వా తుఫానుల కారణంగా రైతులు పంట నష్టపోయారని, పరిహారం విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సభ్యులు కోరారు.
తాగునీటి సమస్యలపై ఆగ్రహం
వేసవిలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై అధికారులు దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించకపోవడంతో తాగునీటి సమస్యలు పరిష్కారానికి నోచు కోవడం లేదని సభ్యులు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై విరుచుకుపడ్డారు. కృత్తివెన్ను మండలంలో పంట కాల్వలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, నాచును నిర్మూలించేందుకు రసాయనాలు పిచికారీ చేసిన తర్వాత, సీతనపల్లి తాగునీటి చెరువులో కలుషితనీటిని నింపారని కృత్తివెన్ను జడ్పీటీసీ సభ్యురాలు రత్నకుమారి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కలుషిత నీటిని తాగిన ప్రజలు అనారోగ్యం పాలైతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు. మోపిదేవి మండలం మోపిదేవి, రావివారిపాలెంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని మోపిదేవి జడ్పీటీసీ సభ్యుడు ఎం.మల్లిఖార్జునరావు కోరారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను సభ్యులు ఏకరువు పెట్టారు. తాగునీటి అవసరాల కోసం ఏడాదికి జడ్పీ నిధులు రూ.40కోట్లను ఇస్తున్నామని, అయినా తాగునీటి సరఫరా సక్రమంగా జరడగం లేదని జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి నీటి పరీక్షలు ఎంతమేర చేస్తున్నారు, అసలు చేస్తున్నారా లేదా అని జేసీ ఎం.నవీన్ అధికారులను నిలదీశారు.
ఎమ్మెల్యేలు రావడం లేదని ప్రారంభోత్సవాలు నిలిపివేస్తారా!
ఉమ్మడి జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు, ఆర్‌ఎస్‌కేలు, సచివాలయ భవనాల నిర్మాణాలు పూర్తయినా శాసన సభ్యులు సమయం ఇవ్వడంలేదనే కారణంతో వాటిని ప్రారంభించడం లేదని, ఇది ఎంతవరకు సమంజసమని సభ్యులంతా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను నిలదీశారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించేందుకు ఎమ్మెల్యేలు వస్తారా, వారు వచ్చేవరకు నూతన భవనాలను ప్రారంభించకూడదని ఏదైనా చట్టం ఉందా అని సభ్యులు అధికారులపై ధ్వజమెత్తారు. పెదపారుపూడి మండలంలో సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వచ్చేందుకు తేదీని ఖరారు చేయలేదని అధికారులు చెప్పడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోరా అని సభ్యులు ప్రశ్నించారు. గూడూరు మండలంలో పలు సచివాలయ, ఆర్‌ఎస్‌కే భవనాలు నిర్మాణం పూర్తయినా ఎమ్మెల్యే రావడం లేదనే కారణంతో వీటిని ప్రారంభించడం లేదని ఎంపీపీ సంగా మధు, జడ్పీటీసీ సభ్యుడు సురేష్ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో 9వ తరగతి పూర్తి చేసిన పిల్లల నుంచి 10వ తరగతికి సంబంధించి ముందస్తుగానే ఫీజులు కట్టించుకుని, పుస్తకాలు కూడా కొనిపిస్తున్నారని, విద్యాశాఖ అధికారులు ఈ అంశంపై దృష్టిసారించాలని సభ్యులు కోరారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు 36 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని సభ్యులు నిలదీశారు. ఇబ్రహీపట్నం మండలం దావులూరు వద్ద కృష్ణానది నుంచి ఇసుకను తవ్వి హైదరాబాద్‌కు తరలించుకుపోతున్నారని, ఇంతా జరుగుతున్నా మైనింగ్ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదని జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గరికపాటి శ్రీదేవి అన్నారు. కృత్తివెన్నులో మట్టిని తవ్వి ఇతర జిల్లాలకు తరలించుకుపోతున్నారని, రెవెన్యూ అధికారులు ఆ వైపుునకు కన్నెత్తి చూడటం లేదని కృత్తివెన్ను జడ్పీటీసీ సభ్యురాలు ఆరోపించారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న, జడ్పీ సీఈవో జె.అరుణ, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.