Minister S. Savitha: ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:27 AM
ఉద్యోగుల హక్కుల పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి వారధులన్నారు.
రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత
విజయవాడలో ఘనంగా బీసీ, ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ
విజయవాడ అర్బన్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల హక్కుల పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి వారధులన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన బీసీ, ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి సవితతో పాటు మరో మంత్రి కొల్లు రవీంద్ర, బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల నాయకులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సవిత మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను రాష్ట్రంలో అమలు చేసిన తొలి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించి, వారు రాజకీయంగా, పారిశ్రామికంగా ఎదిగేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆ ఒరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తూ బీసీ ఉద్యోగుల పక్షపాతిగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా బీసీ, ఓబీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా అమరావతిలో మహాసభ జరగడం చారిత్రాత్మకమని తెలిపారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక ‘బీసీ రక్షణ చట్టం’ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు.
బీసీ ఉద్యోగులతో 26 జిల్లాల కమిటీలను వేయడం అభినందించాల్సిన విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు అమలుచేస్తున్న పథకాలను ఐదేళ్లు సద్వినియోగం చేసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని పేర్కొన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం నేత గుత్తుల వీరబ్రహ్మం మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి అయిన ఏప్రిల్ 11ను ప్రభుత్వ సెలవుగా ప్రకటించాలని, బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు, క్రీమీలేయర్ తొలగింపు, బీసీ అట్రాసిటీ చట్టం అమలు చేయాలని కోరారు. అనంతరం వారు బీసీ ఉద్యోగుల క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ, బీసీ, ఓబీసీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ కేదారేశ్వరరావు, జనరల్ సెక్రటరీలు పి.శ్రీధర్, భూషణ్‌రావు, ట్రెజరర్ వై.శంకర్ రావు, 26 జిల్లాల ఉద్యోగులు పాల్గొన్నారు.