Share News

Endowments Department: దేవదాయంలో పదోన్నతుల రచ్చ!

ABN , Publish Date - Jan 17 , 2026 | 03:46 AM

దేవదాయ శాఖలో ఉద్యోగులకు పదోన్నతి దక్కడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఉన్నతాధికారులకు నచ్చాలి.. వారి మెప్పు పొందాలి... ఎస్టాబ్లిష్మెంట్ విభాగం అధికారులను ప్రసన్నం చేసుకోవాలి...

Endowments Department: దేవదాయంలో పదోన్నతుల రచ్చ!

  • అధికారుల అండదండలు ఉన్నవారికే ప్రమోషన్లు

  • నెలలు గడుస్తున్నా భర్తీ కాని సూపరింటెండెంట్‌ పోస్టులు

  • గెజిటెడ్‌ సూపరింటెండెంట్‌ పోస్టు 14 రోజుల్లోనే భర్తీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖలో ఉద్యోగులకు పదోన్నతి దక్కడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఉన్నతాధికారులకు నచ్చాలి.. వారి మెప్పు పొందాలి... ఎస్టాబ్లిష్మెంట్ విభాగం అధికారులను ప్రసన్నం చేసుకోవాలి... ఆ తర్వాతే ఎవరికైనా ప్రమోషన్‌ లభిస్తుంది. అధికారులను ప్రసన్నం చేసుకుంటే అర్హత లేకపోయినా పదోన్నతులు ఇచ్చేస్తుంటారు. లేకపోతే ఆ ఉద్యోగి ఎన్నేళ్లైనా అదే కేడర్‌లో ఉండిపోవాల్సిందే. డిప్యూటీ కమిషనర్‌ నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల వరకూ దేవదాయ శాఖలో ఇదే విధానం అమలవుతోంది. శాఖ ప్రధాన కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులపై తీవ్ర వివక్ష కొనసాగుతోంది. ఇక్కడ ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్‌ పోస్టును భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అయితే గతేడాది డిసెంబరు 31న ఖాళీ అయిన గెజిటెడ్‌ సూపరింటెండెంట్‌ పోస్టును మాత్రం ఆగమేఘాలపై భర్తీ చేశారు. ల్యాండ్‌ సెక్షన్‌ చూసే సూపరింటెండెంట్‌కు జనవరి 14న గెజిటెడ్‌ సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించారు. ఇదే వేగం సూపరింటెండెంట్‌ పోస్టు విషయంలో ఎందుకు చూపించడం లేదని విమర్శలొస్తున్నాయి. గతవారం ఒక అసిస్టెంట్‌ కమిషనర్‌ పదోన్నతికి సంబంధించి జాతీయ ఎస్టీ కమిషనర్‌ జోక్యం చేసుకుంటే తప్ప ప్రమోషన్‌ ఇవ్వలేదు. శాఖలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఎందుకు అమలు చేయడం లేదని కమిషన్‌ మొట్టికాయలు వేసే పరిస్థితి వచ్చింది. మరోవైపు జనవరి 31 నాటికి అన్ని శాఖల్లో అర్హత కలిగిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించింది. దేవదాయ శాఖలో ఈ ఆదేశాల అమలు సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే...

దేవదాయ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతులపై కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. రాష్ట్ర విభజనకు ముందు శాఖలో 31 ఎస్‌ఏ పోస్టులు ఉన్నాయి. వీటిలో 17 పోస్టులు ఏపీకి, 14 తెలంగాణకు వెళ్లాలి. కానీ అప్పటి దేవదాయ శాఖ అధికారులు మొత్తం 51 పోస్టులు చూపించి, 34 ఏపీకి వచ్చినట్లు రికార్డులు సృష్టించారు. ఈ విషయాన్ని సాధారణ పరిపాలన శాఖ నిర్ధారించింది. కేడర్‌ స్ర్టెంత్‌ ప్రకారం శాఖలో 17 సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉంటే 19 మందికి ఆ స్థానంలోకి పదోన్నతులు కల్పించారు. అడిగినవారికి అడిగినట్టు ప్రమోషన్‌ ఇచ్చేశారు. ఇప్పుడు దేవదాయ శాఖకు ఇదో తలనొప్పిగా తయారైంది. ఈ చిక్కుముడి కారణంగా భవిష్యత్తులో ఏ ఉద్యోగి పై కేడర్‌కు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అక్రమంగా పదోన్నతులు కల్పించిన వారికి రివర్సల్‌ ఇచ్చి, ఆ వెంటనే తిరిగి పదోన్నతులు కల్పిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావని పలువురు సూచిస్తున్నారు. అయితే శాఖలో అంతర్గత రాజకీయాలు ఈ సమస్యను మరింత జటిలంగా మారుస్తున్నాయి. అక్రమ పదోన్నతులకు సంబంధించిన సమస్యలు ప్రభుత్వం జోక్యంతోనే పరిష్కారమవుతాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 17 , 2026 | 03:48 AM