ప్రగతి పరుగు!
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:40 AM
ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దశలో ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలు రాష్ర్టాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ)లో తిరుగులేని స్థానాలను సాధించాయి. జీడీడీపీలో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానం సాధించగా.. కృష్ణాజిల్లా మూడవ స్థానాన్ని సాధించింది. వ్యవసాయానుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాలలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు అగ్రస్థానం కోసం పోటీపడ్డాయి. విశాఖపట్నం అగ్రస్థానాన్ని దక్కించుకోగా, ఆ తర్వాత రెండు స్థానాలలో నిలిచాయి. సేవా రంగంలో ఎన్టీఆర్ జిల్లా, వ్యవసాయ రంగంలో కృష్ణా జిల్లా, పారిశ్రామిక రంగంలో సమంగా పోటీ పడుతూ జిల్లా అభివృద్ధికి దోహదపడటంతో పాటు గణనీయమైన కాంట్రిబ్యూషన్, వృద్ధిలను నమోదు చేయటం విశేషం. తలసరి ఆదాయంలో కూడా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. కీలక ప్రగతి సూచిక (కేపీఐ) లలో కాస్త తడబడినా ఫర్వాలేదనిపించాయి. కేపీఐఐలో మరింతగా దూసుకుపోతే రెండు జిల్లాలు తమ స్థానాలలో ఎగబాకే అవకాశం ఉంటుంది.
- జీడీడీపీలో ఎన్టీఆర్ జిల్లాకు 2వ స్థానం, కృష్ణాజిల్లాకు 3వ స్థానం
- రూ. 1,05,173 కోట్ల జీడీడీపీ సాధించిన ఎన్టీఆర్ జిల్లా
- 5.97 శాతం కాంట్రిబ్యూషన్‌తో 12.93 శాతం వృద్ధి
- రూ.98,801 కోట్ల జీడీడీపీ సాధించిన కృష్ణాజిల్లా
- 5.61 కంట్రిబ్యూషన్‌తో 18.20 శాతం వృద్ధి
- తలసరి ఆదాయంలోనూ 2, 3 స్థానాలు సొంతం
- ఎన్టీఆర్ జిల్లా తలసరి ఆదాయం రూ.4,82,078
- కృష్ణాజిల్లా తలసరి ఆదాయం రూ. 3,91,390
ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దశలో ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలు రాష్ర్టాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ)లో తిరుగులేని స్థానాలను సాధించాయి. జీడీడీపీలో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానం సాధించగా.. కృష్ణాజిల్లా మూడవ స్థానాన్ని సాధించింది. వ్యవసాయానుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాలలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు అగ్రస్థానం కోసం పోటీపడ్డాయి. విశాఖపట్నం అగ్రస్థానాన్ని దక్కించుకోగా, ఆ తర్వాత రెండు స్థానాలలో నిలిచాయి. సేవా రంగంలో ఎన్టీఆర్ జిల్లా, వ్యవసాయ రంగంలో కృష్ణా జిల్లా, పారిశ్రామిక రంగంలో సమంగా పోటీ పడుతూ జిల్లా అభివృద్ధికి దోహదపడటంతో పాటు గణనీయమైన కాంట్రిబ్యూషన్, వృద్ధిలను నమోదు చేయటం విశేషం. తలసరి ఆదాయంలో కూడా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. కీలక ప్రగతి సూచిక (కేపీఐ) లలో కాస్త తడబడినా ఫర్వాలేదనిపించాయి. కేపీఐఐలో మరింతగా దూసుకుపోతే రెండు జిల్లాలు తమ స్థానాలలో ఎగబాకే అవకాశం ఉంటుంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ)లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు సత్తా చాటాయి. 2025 - 26 ఆర్థిక సంవత్సరాంతంలో కూడా రాష్ట్రంలోనే టాప్ - 5లో చోటు సంపాదించాయి. ఎన్టీఆర్ జిల్లా జీడీడీపీలో 2వ స్థానంలో నిలవగా.. కృష్ణాజిల్లా నాలుగు నుంచి ఒక స్థానం మెరుగుపరచుకుని 3వ స్థానానికి ఎగబాకింది. విశాఖపట్నం మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత రెండు స్థానాలు మనవే కావటం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లా జీడీడీపీ రూ.93,132 కోట్లు సాధించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 5.85 శాతం కాంట్రిబ్యూషన్‌తో 12.78 శాతం వృద్ధిని నమోదు చేసి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రస్తుతం వరకు రూ. 1,05,173 కోట్ల జీడీడీపీతో 5.97 శాతం కాంట్రిబ్యూషన్‌తో 12.93 శాతం వృద్ధిని నమోదు చేసి రాష్ట్రంలోనే రెండవ స్థానాన్ని పదిలపరుచుకుంది. కృష్ణాజిల్లా 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో రూ.83,584 కోట్ల జీడీడీపీ ద్వారా 5.25 శాతం కాంట్రిబ్యూషన్‌తో 12.75 శాతం వృద్ధిని నమోదు చేసి రాష్ట్రంలోనే నాల్గవ స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.98,801 కోట్ల జీడీడీపీ ద్వారా 5.61 కంట్రిబ్యూషన్‌తో 18.20 శాతం వృద్ధిని నమోదు చేసి రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచింది. కిందటి ఆర్థిక సంవత్సరం కంటే ఒక్క శాతం మెరుగుపరచుకుని మూడవ స్థానానికి ఎగబాకటం విశేషం.
తలసరి ఆదాయంలోనూ 2, 3 స్థానాలు
రాష్ట్ర తలసరి ఆదాయంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు మరోమారు కీలక పాత్ర పోషించాయి. తలసరి ఆదాయంలో కృష్ణాజిల్లా రూ.4,82,078 సాధించింది. 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసిన రూ. 4,08,829 కంటే కూడా 17.92 శాతం వృద్ధిని నమోదు చేయటం ద్వారా రాష్ట్రంలోనే రెండవ అత్యధిక తలసరి ఆదాయం సాధించిన జిల్లాగా నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.3,47,623 కంటే 12.59 శాతం వృద్ధితో రూ. 3,91,390 సాధించి రాష్ట్రంలోనే మూడవ అత్యధిక తలసరి ఆదాయం సాధించిన జిల్లాగా అవతరించింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో నాలుగో స్థానంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని 3వ స్థానంలో నిలవటం విశేషం.
- రంగాల వారిగా ప్రగతి ఇలా..
- వ్యవసాయానుబంధ రంగంలో కృష్ణాజిల్లా రూ.48,499 కోట్ల ఉత్పాదకతను సాధించి 8.99 కాంట్రిబ్యూషన్‌తో 24.27శాతం వృద్ధిని నమోదు చేయటం విశేషం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా కృష్ణాజిల్లా రూ.39,028 కోట్ల ఉత్పాదకతతో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. 2025- 26 ఆర్థిక సంవత్సరంలో కూడా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచి తన స్థానాన్ని పదిలపరచుకుంది. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ ప్రధానమైన జిల్లా కానందున రూ.11,473 కోట్ల ఉత్పాదకతతో రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది.
- పారిశ్రామిక రంగంలో ఎన్టీఆర్ జిల్లా 5.25 శాతం కాంట్రిబ్యూషన్‌తో 9.72 శాతం వృద్ధిని నమోదు చేసి, రూ.20,190 కోట్ల ఉత్పాదకతను సాధించటం జరిగింది. రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5వ స్థానం సాధించగా, ఒక్క స్థానం దిగువకు వచ్చింది. కృష్ణాజిల్లా విషయానికి వస్తే రూ. 10,024 కోట్ల ఉత్పాదకతతో 13వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా కృష్ణా జిల్లా ఇదే స్థానాన్ని సాధించటం గమనార్హం.
- సేవా రంగంలో ఎన్టీఆర్ జిల్లా దుమ్ము దులిపింది. మొత్తం 9.32 శాతం కాంట్రిబ్యూషన్‌తో 14.49 శాతం వృద్ధితో రూ. 65,291 కోట్ల ఉత్పాదకతను సాధించి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని కొనసాగించింది. రెండవ స్థానం చెక్కుచెదరలేదు. కృష్ణాజిల్లా విషయానికి వస్తే రూ.32,558 కోట్ల ఉత్పాదకతతో 4.65 కాంట్రిబ్యూషన్ ద్వారా 12.37 శాతం వృద్ధిని నమోదు చేస్తూ రాష్ట్రంలో 6వ స్థానాన్ని నిలబెట్టుకుంది.
కీలక ప్రగతి సూచికలలో ఇలా..
కీలక ప్రగతి సూచిక (కేపీఐ)లలో అగ్రస్థానంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఈ సారి కొద్దిగా తడబడింది. కృష్ణాజిల్లా మెరుగుపరచుకునేందుకు కృషి చేసింది. ప్రభుత్వం ప్రకటించిన కేపీఐ ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే.. వ్యవసాయానుబంధ రంగాలలో ఎన్టీర్ జిల్లా 39 ఇండికేటర్లలో 85 స్కోరు సాధించి ఏ గ్రేడ్‌ను సాధించగా.. కృష్ణాజిల్లా 41 ఇండికేటర్లలో 80 స్కోర్ సాధించి ఏ గ్రేడ్‌ను సాధించింది. పారిశ్రామిక రంగంలో ఎన్టీఆర్ జిల్లా 7 ఇండికేటర్లలో 89 స్కోర్ సాధించి ఏ గ్రేడ్, కృష్ణాజిల్లా 4 ఇండికేటర్లలో 86 స్కోరు సాధించి ఏ గ్రేడ్‌ను సాధించింది. సేవా రంగంలో ఎన్టీఆర్ జిల్లా 7 ఇండికేటర్లలో 93 స్కోర్ సాధించి ఏ ప్లస్ గ్రేడ్‌ను, కృష్ణా జిల్లా 10 ఇండికేటర్లలో 84 స్కోర్ సాధించి ఏ గ్రేడ్‌ను సాధించింది.