Share News

అవమానాలే ఆ తల్లికి శాపాలు!

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:50 AM

అసలే పేదరికం.. బాధ్యతగా సంసారాన్ని నెట్టుకురావాల్సిన భర్త.. భార్యా పిల్లల్ని వదిలి మరో మహిళతో వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అక్కున చేర్చుకోవాల్సిన అత్త అవమానాలకు గురిచేసింది.

అవమానాలే ఆ తల్లికి శాపాలు!

  • భర్తలేని లోటు, అత్త వేధింపులతో నరకం

  • 20 రోజుల క్రితం ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం

  • చికిత్స పొందుతూ ఒక్కొక్కరుగా మృతి

  • ప్రొద్దుటూరులో పెను విషాదం

ప్రొద్దుటూరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): అసలే పేదరికం.. బాధ్యతగా సంసారాన్ని నెట్టుకురావాల్సిన భర్త.. భార్యా పిల్లల్ని వదిలి మరో మహిళతో వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అక్కున చేర్చుకోవాల్సిన అత్త అవమానాలకు గురిచేసింది. దీంతో బతుకుపై విరక్తిచెందిన ఆ తల్లి.. పిల్లలతో సహా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లితో సహా పిల్లలంతా మృత్యువుతో పోరాడుతూ ఒకరి తరువాత ఒకరు మృతిచెందారు. ఈ విషాద సంఘటన వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ప్రొద్దుటూరు ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న శివవెంకటకృష్ణ, భువనేశ్వరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు. వీరితో పాటు అతని తల్లి తిరుపతమ్మ కూడా ఉండేది. రెండేళ్ల క్రితం శివవెంకటకృష్ణ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో భువనేశ్వరి.. ముగ్గురు పిల్లలను, అత్తను కూలి పనులు చేస్తూ పోషిస్తోంది. తిరుపతమ్మ కోడలికి అన్ని విధాల అండగా ఉండాల్సింది పోయి.. ఆమె ఎవరితో మాట్లాడినా అనుమానించేది. అవమానాలకు గురిచేసేది. దీంతో మనస్తాపానికి గురైన భువనేశ్వరి గత నెల 26న పిల్లలు కుసుమ(13), లిఖిత(11), గణ(9)కు పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింకు తాగించింది. ఆ తరువాత తానూ తాగేసింది. సాయంత్రం బయటి నుంచి ఇంటికి వచ్చిన అత్త ఇంట్లో అందరూ పడిఉండటం చూసి వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తరలించారు. భువనేశ్వరి (33) చికిత్స పొందుతూ మార్చి 28న మృతి చెందింది. పిల్లల పరిస్థితి విషమించడంతో వారిని చెన్నైకి తరలించి చికిత్స అందిస్తుండగా లిఖిత ఈ నెల 10న కన్నుమూసింది. కుమారుడు గణ 15న ప్రాణాలు వీడగా, పెద్దకుమార్తె కుసుమ గురువారం మృతి చెందింది. పాపం పుణ్యం తెలియని పిల్లల మరణాలతో ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం నెలకొంది.

Updated Date - Apr 18 , 2026 | 03:50 AM