సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:41 PM
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక నాయకులు శశిరెడ్డి, మనోహర్ నాయుడు, విష్ణురెడ్డి డిమాండ్ చేశారు.
ఆదోని అగ్రికల్చర్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక నాయకులు శశిరెడ్డి, మనోహర్ నాయుడు, విష్ణురెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని కేడీసీసీ బ్యాంక్ వద్ద ఆదోని రెవెన్యూ డివిజనలోని సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెం. 112 రద్దు చేసి, జీవో నెం. 36ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి 2024 వరకు వేతన సవరణ చేపట్టాలని కోరారు. అప్పటి వరకు మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. 2019 తరువాత ఉద్యోగ భాధ్యతలు చేపట్టిన వారిని వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలని అన్నారు. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలన్నారు. వెంటనే రాష్ట్ర కమిషనర్ సహకార సంఘాల ఉద్యోగుల డిమాండ్‌లను నెరవేర్చాలని, లేనిపక్షంలో మరింత ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన, సీఐటీయూ నాయకులు వేణుగోపాల్, గిడ్డయ్య, రహంతుల్లా, పోతేశ రెడ్డి, లక్ష్మణ్ణ, తిప్పన్న పాల్గొన్నారు.
కక్ష సాధింపు చర్యలా..?
తుగ్గలి: సహకార సొసైటీ ఉద్యోగస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తుంటే.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మారెళ్ల, ఉప్పర్లపల్లి సహకార సంఘం సొసైటీల సీఈవోలు మనోహర్ నాయుడు, గిడ్డయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న సహకార సంఘం ఉద్యోగస్థులు విధుల్లో చేరకపోతే, వారి స్థానంలో ఇనచార్జిలను ఏర్పాటు చేసి సొసైటీలను నడిపిస్తామని తెలపడం శోచనీయమన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.