Share News

ప్రియాంక కేసులో వైసీపీ ఓవరాక్షన్‌!

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:53 AM

డాక్టర్‌ ప్రియాంక మరణం కేసులో బాధిత కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

ప్రియాంక కేసులో వైసీపీ ఓవరాక్షన్‌!

  • జగన్‌ వద్దకు బాధిత తల్లిదండ్రులను తీసుకెళ్లిన మాజీ ఎంపీ భరత్‌

  • వైసీపీ తనదైన ‘శవ రాజకీయం’

రాజమహేంద్రవరం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ ప్రియాంక మరణం కేసులో బాధిత కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇలాంటి సమయంలోనూ వైసీపీ నాయకులు మాత్రం యథావిధిగా ఓవరాక్షన్‌ చేస్తున్నారు! తమదైన శైలిలో ‘శవ రాజకీయం’ చేయడం మానుకోలేదు!! రాజమండ్రి మాజీ ఎంపీ భరత్‌ గురువారం ప్రియాంక తల్లిదండ్రులను జగన్‌ వద్దకు తీసుకెళ్లడం విమర్శలకు తావిస్తోంది. కేసు దారి మళ్లకుండా ప్రభుత్వం దర్యాప్తు బాధ్యతలను అడిషనల్‌ ఎస్పీకి అప్పగించడంతో పాటు బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రి బిల్లులను సైతం చెల్లించింది. అండ గా ఉంటామని భరోసా ఇచ్చింది. అటు ప్రియాంక పీజీ చదువుతున్న జీఎ్‌సఎల్‌ ఆస్పత్రి కూడా రూ.20 లక్షల ఆర్థిక సహాయంతో పాటు తమకు చెల్లించిన ఫీజులను వెనక్కు ఇచ్చేసింది. నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పోలీసులను ఆదేశించారు.


సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌.. నిందితుల విచారణ

కేసు తీవ్రత, దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐపై ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అడిషనల్‌ ఎస్పీ(అడ్మిన్‌) పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌ను ఐవోగా నియమించింది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. నిందితులను వెనకేసుకొచ్చే విధం గా మాట్లాడిన డీఎస్పీని దర్యాప్తుకు దూరంగా ఉంచారు. బుధవారం నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. కేసును తారుమారు చేయడానికి అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడి కుమారుడు ప్రయత్నం చేశాడని, భారీగా సొమ్ము చేతులు మారిందన్న ఆరోపణల కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో పోలీసులపై ముందు నుంచీ పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా ప్రకాశంనగర్‌ సీఐ, డీఎస్పీని కూడా ఐవో ప్రశ్నించే అవకాశం ఉంది.

Updated Date - Aug 21 , 2026 | 04:55 AM