ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ABN , Publish Date - May 27 , 2026 | 05:13 AM
అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామ శివారులో కేకే ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. 44వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో..
21 మందికి తీవ్ర గాయాలు
నలుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్ నుంచి ధర్మవరం వస్తుండగా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద ప్రమాదం
గుత్తి రూరల్, మే 26 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామ శివారులో కేకే ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. 44వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి సోమవారం రాత్రి 24 మంది ప్రయాణికులతో ఈ బస్సు బయలుదేరింది. వన్నేదొడ్డి శివారుకు రాగానే డ్రైవర్ రహీం నిద్రమత్తులో తూలడంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి, పక్కనే ఉన్న గుంతలోకి పల్టీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్నవారిలో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ మార్గంలో వెళ్లేవారు, స్థానికులు సహాయకార్యక్రమా లు చేపట్టారు. క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు చేర్చి, 108 వాహనంలో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన మేరి, భానురేఖ, నిఖిల్, ఉషారాణి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని అనంతపురానికి తరలించారు. గుత్తి సీఐ రామారావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.