Share News

టెన్త్‌ ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లు

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:36 AM

ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లనూ నియమించాలని నిర్ణయించిన పాఠశాల విద్యా శాఖ..

టెన్త్‌ ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లు

  • మొత్తం 33,882 మంది.. 78.1శాతం ప్రభుత్వ, 21.9శాతం ప్రైవేటు టీచర్లు

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లనూ నియమించాలని నిర్ణయించిన పాఠశాల విద్యా శాఖ.. 21.9శాతం మంది ప్రైవేటు టీచర్లకు ఇన్విజిలేషన్‌ బాధ్యతలు అప్పగిస్తోంది. మొత్తంగా 33,882 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించగా.. వారిలో 26,453 (78.1శాతం) ప్రభుత్వ టీచర్లు, 7,429 (21.9శాతం) ప్రైవేటు టీచర్లు ఉన్నారు. ఏటా ఇన్విజిలేటర్ల నియామకం డీఈవోల చేతిలో ఉండేది. ఈసారి పాఠశాల విద్యాశాఖ ఆటోమేషన్‌ విధానంలో కమిషనరేట్‌ నుంచే ఎవరికి ఎక్కడ ఇన్విజిలేషన్‌ వేయాలనేది నిర్ణయించింది. 46.64శాతం మంది టీచర్లకు వారు పనిచేస్తున్న పాఠశాల నుంచి రెండు కిలోమీటర్ల లోపు, 30.84శాతం మందికి 2 నుంచి 5, 18.21శాతం మందికి 5 నుంచి 10, 4.3శాతం మందికి 10 నుంచి 20, 0.74శాతం మందికి 20 నుంచి 25 కిలోమీటర్ల పరిధిలో ఇన్విజిలేటర్లుగా కేంద్రాలు కేటాయించింది. 8,214 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 25,668 మంది ఎస్జీటీలు ఇన్విజిలేషన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రైవేటు టీచర్లను నియమించినా అన్ని కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటిండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ విధుల్లో ప్రభుత్వ టీచర్లే ఉంటారు. ఏటా ప్రభుత్వ టీచర్లను మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నారు. దానివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కుంటుపడుతోంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో బ్రిడ్జి కోర్సులు, తర్వాత విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకుంటున్నారు. దీనిని గుర్తించిన పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ బడుల్లో బోధనకు అంతరాయం లేకుండా ప్రైవేటు టీచర్లనూ ఇన్విజిలేటర్లుగా నియమించింది.

Updated Date - Mar 14 , 2026 | 04:37 AM