Share News

డిగ్రీ కళాశాలలను బతికించండి

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:16 AM

రాష్ట్రంలో 2019కు ముందున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని తిరిగి పునరుద్ధరించి ప్రైవేటు డిగ్రీ కళాశాలలను బతికించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు డిగ్రీ కాలేజీ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

డిగ్రీ కళాశాలలను బతికించండి

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పునరుద్ధరించాలి

  • ఏపీపీడీసీఎంఏ

మంగళగిరి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2019కు ముందున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని తిరిగి పునరుద్ధరించి ప్రైవేటు డిగ్రీ కళాశాలలను బతికించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు డిగ్రీ కాలేజీ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. గుంటూరు జిల్లా చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో మంగళవారం సమావేశమైన అసోసియేషన్‌ ప్రతినిధులు తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.రమణ్‌జీ మాట్లాడుతూ గత మూడేళ్లుగా డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం నుంచి రావల్సిన కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. గత మూడు సంవత్సరాలకు గాను ప్రభుత్వం కేవలం రూ.1100 కోట్లను మాత్రమే విడుదల చేసిందన్నారు. కానీ ఇంకా 90శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. తాజాగా గత ఫిబ్రవరి నెలలో రూ.1200 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చినప్పటికీ రెండు విడతలుగా రూ.630 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. అదేమంటే నిధుల కొరత సమస్య వుందని అధికారులు సమాధానమిస్తున్నారన్నారు. ఈ పరిస్థితులలో రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు తీవ్రమైన ఆర్థికమాంద్యాన్ని అనుభవిస్తూ ఇబ్బందులకు లోనవుతున్నాయన్నారు. యూనివర్సిటీలకు ఫీజులు చెల్లించలేక, అధ్యాపకులకు వేతనాలను చెల్లించలేక అవస్థలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. దీంతో చాలామంది అధ్యాపకులు గత్యంతరం లేక ఇతర వృత్తులకు మళ్లిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో మాదిరిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు విఽధానాన్ని పునరుద్ధరించడంతోపాటు ఫీజులను 30 శాతం మేర పెంచాలని, కొంత ఫీజును ప్రభుత్వం చెల్లించినా మిగిలిన సొమ్మును విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి గతంలో మాదిరి వసూలు చేసుకునే వెసులుబాటును కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 22 , 2026 | 05:18 AM