స్టాక్ మార్కెట్‌లో నష్టాలకు ఒకరు బలి!
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:39 AM
ప్రైవేటు కంపెనీలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒకరు స్టాక్ మార్కెట్‌లో నష్టపోవడంతో అప్పుల పాలై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రైవేటు కంపెనీ చీఫ్ ఇంజనీర్ ఆత్మహత్య
దువ్వాడ సమీపంలో రైలు కిందపడి బలవన్మరణం
స్వగ్రామం చిత్తూరు జిల్లా బొమ్మసముద్రం
కూర్మన్నపాలెం(విశాఖపట్నం), ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు కంపెనీలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒకరు స్టాక్ మార్కెట్‌లో నష్టపోవడంతో అప్పుల పాలై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. దువ్వాడ రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కేటీఆర్ లక్ష్మి తెలిపిన వివరాల మేరకు చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని బొమ్మసముద్రం గ్రామానికి చెందిన చల్లగుండ్ల హర్షవర్దన్(36).. భార్య, కుమార్తెతో కలిసి విశాఖ నగరం పెదగంట్యాడ వినాయకనగర్ వుడా కాలనీలో నివాసం ఉంటున్నారు. హర్షవర్దన్ పదిహేనేళ్లుగా శ్రవణ్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్నారు. ఊరు వెళుతున్నానని చెప్పి బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన హర్షవర్దన్ దువ్వాడ రైల్వేస్టేషన్ సమీపంలో జన్మభూమి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. తాను మంచి కొడుకు, భర్త, తండ్రిని కాలేకపోయానంటూ ఇంటి నుంచి బయలుదేరడానికి ముందే భార్యకు ఫోన్‌లో మెసేజ్ పెట్టారు. స్టాక్ మార్కెట్‌లో నష్టాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. కుమార్తెను బాగా చూసుకోవాలని సూచించారు. అనంతరం తన ఫోన్‌ను ఇంటి వద్దే వదిలేశారు. కొద్దిసేపటికి ఆ మెసేజ్ చూసిన భార్య వెంటనే న్యూపోర్టు పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు అన్ని పోలీ్‌సస్టేషన్లకు సమాచారం ఇచ్చి గాలింపు చేపట్టారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.