Share News

ఇక్కడ రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:07 AM

ప్రయాణికుల ప్రాణాల కన్నా లాభాలే మాకు ముఖ్యం అంటూ పొరుగు మార్గాలు చూసుకొన్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రేకులేశాయి. బస్సు ఎక్కడ కొన్నారనేది కాదు..

ఇక్కడ రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి

  • ప్రైవేటు ట్రావెల్స్‌ అడ్డదారికి బ్రేకులు

  • అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ల్లో రిజిస్ట్రేషన్లతో ఇక్కడ వ్యాపారాలకు చెక్‌

  • ఆలిండియా పర్మిట్‌లో మళ్లీ పాత రూల్‌ సడలింపులు రద్దు చేసిన కేంద్రం

  • సవరణతో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు..

  • ప్రయాణికుల ప్రాణాలకూ గ్యారంటీ..

ప్రకాశం జిల్లాకు చెందిన బస్సు యజమాని డామన్‌-డయ్యూ(కేంద్ర పాలిత ప్రాంతం)లో బస్సు రిజిస్ట్రేషన్‌ చేయించారు. కానీ హైదరాబాద్‌ - బెంగళూరు మధ్య ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా బస్సు తిప్పుతున్నాడు. గత ఏడాది కర్నూలులో ఈ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు తెలంగాణలోని జగిత్యాలలో బయలుదేరి కనిగిరికి చేరుకోవాలి. నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన హర్షవర్ధన్‌ రెడ్డి లక్షద్వీప్‌లో ఈ బస్సు కొనుగోలు చేసి అరుణాచల్‌ ప్రదేశ్‌కు రిజిస్ట్రేషన్‌ మార్చుకున్నారు. అక్కడే ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకుని ఏపీ-తెలంగాణ మధ్య ప్రయాణికుల్ని ఆ బస్సులో తరలిస్తున్నారు. మార్కాపురంలో ఇటీవల ఈ బస్సు బుగ్గయింది.

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల ప్రాణాల కన్నా లాభాలే మాకు ముఖ్యం అంటూ పొరుగు మార్గాలు చూసుకొన్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రేకులేశాయి. బస్సు ఎక్కడ కొన్నారనేది కాదు..ఎక్కడ తిప్పుతారనేదే ప్రధానమని, అక్కడే రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని తేల్చి చెప్పాయి. నిజానికి గతంలో ఇదే విధానం ఉంది. అయితే, ఒకే దేశం.. ఒకే విధానం.. పేరిట కేంద్రం.. ఈ విధానాన్ని సడలించింది. ఈ అవకాశాన్ని కొందరు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌లలో బస్సు రిజిస్ట్రేషన్‌ చేయించి అక్కడే పన్నులు చెల్లించి, తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల మధ్య సర్వీసులు తిప్పుతున్నారు. మన రాష్ట్రంలో ఒక బస్సు ఏడాది పాటు రోడ్లపై తిప్పాలంటే త్రైమాసికానికి రూ.90వేల చొప్పున రూ.3.60 లక్షలు రవాణా శాఖకు చెల్లించాలి. అదే ఈశాన్య రాష్ట్రాలైతే ఏడాదికి యాభై వేలు చెల్లిస్తే సరిపోతుంది. అక్కడ రిజిస్టరైన బస్సు ఇక్కడ తిప్పడానికి ఆలిండియా పర్మిట్‌(ఏడాదికి రూ.2లక్షలు) కేంద్రం జారీ చేస్తుంది. ఆ 2లక్షలు రాష్ట్రాలకే పంచుతామనడంతో రాష్ట్రాలు సమ్మతించాయి.


రాష్ట్రం నివేదికతో కదిలిన కేంద్రం

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు వరుస ప్రమాదాలకు గురి అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ అధికారులతో పది రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం దాడులు జరిపించింది. వందలాది బస్సులపై కేసులు నమోదు చేయించింది. ఏపీలో దాదాపు ప్రైవేటు వాహనాలన్నీ కూడా నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే ఎక్కువుగా రిజిస్ర్టేషన్‌ చేయిస్తుండటం వెనకున్న అసలు రహస్యాన్ని గుర్తించింది. దీనిపై కేంద్రానికి నివేదిక పంపించింది. అప్పటికే దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలనుంచీ అదే తరహా లోటుపాట్లతో కేంద్రానికి లేఖలు అందాయి. దీంతో పాత విధానాన్నే కొనసాగించాలంటూ గత నెల 13న ఆదేశాలు జారీ చేసింది.

ఆపరేటర్ల లాబీయింగ్‌

ప్రైవేటు ఆపరేటర్లు ఒక రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధిని కలిసి తమకు పన్నులు తగ్గించి, కొన్ని మినహాయింపులు ఇవ్వాలని లాబీయింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆలిండియా పర్మిట్‌ ఏడాదికి కాకుండా ఐదు సంవత్సరాలకు కూడా ఇస్తున్నారని ఆ ప్రజా ప్రతినిధికి వివరించారు. అలాగే, ఈశాన్యంలో రిజిస్ర్టేషన్లు చేయించుకోవటం చాలా సులభమని, వాహనం లేకపోయినా కేవలం వాట్సాప్‌లో కాగితాలు పంపిస్తే గంటలలోనే రిజిస్ర్టేషన్లు జరిగిపోవటంతోపాటు నంబర్‌ వచ్చేస్తుందని తెలిపారు. ఫిజికల్‌ వెరిఫికేషన్‌ పెద్దగా లేకపోవటం, ఫైర్‌ సేఫ్టీ స్టాండర్డ్‌ సర్టిఫికెట్లను అడగకపోవటం వల్ల గంటలలోనే పని అయిపోతుందని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో నిబంధనలు కఠినంగా ఉండటంతోపాటు, పన్నులు బాగా ఎక్కువ అని తెలిపారు. మరో వైపు రవాణా శాఖ అధికారుల లంచాలూ భరించలేక పోతున్నామంటూ రెండో కోణాన్ని కూడా వివరించారు. ప్రైవేటు బస్సులపై ఆ నాయకుడు పన్నులు తగ్గించేలా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ ప్రయత్నాలను రవాణా శాఖ ఉన్నతాధికారులు వారించినట్టు తెలిసింది.

Updated Date - Apr 19 , 2026 | 04:08 AM