ధరాఘాతం
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:56 AM
టమాట సాగు చేసిన రైతులు ఈ ఏడాది దిగుబడిని చూసి మురిసిపోయారు. ఇక తమ కష్టాలు తీరతాయని కలలుగన్నారు. కూలీలతో పంట కోయించి సంతోషంగా రైతు బజార్‌కు తరలించారు. అక్కడ వారు అడుగుతున్న ధరలు చూసి కన్నీటిపర్యంతమయ్యారు. కేజీ రూ.2 ధర కూడా లేకపోవడం, రవాణా, కూలీల ఖర్చులు రాకపోవడంతో గుండెల నిండా బాధ నింపుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు. కోత కూలి కూడా రావడంలేదని పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
- ధరలేక టమాట రైతుల వెతలు
- ఎకరానికి రూ.80 వేల వరకు పెట్టుబడి
- ఆశాజనకంగా దిగుబడులు
- కేజీ రూ.2 కూడా పలకని ధర
- కోతకూలి రాక పొలాల్లోనే వదిలేస్తున్న పంట
- ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకోలు
టమాట సాగు చేసిన రైతులు ఈ ఏడాది దిగుబడిని చూసి మురిసిపోయారు. ఇక తమ కష్టాలు తీరతాయని కలలుగన్నారు. కూలీలతో పంట కోయించి సంతోషంగా రైతు బజార్‌కు తరలించారు. అక్కడ వారు అడుగుతున్న ధరలు చూసి కన్నీటిపర్యంతమయ్యారు. కేజీ రూ.2 ధర కూడా లేకపోవడం, రవాణా, కూలీల ఖర్చులు రాకపోవడంతో గుండెల నిండా బాధ నింపుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు. కోత కూలి కూడా రావడంలేదని పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఆంధ్రజ్యోతి-మోపిదేవి:
లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి పండించిన టమాట పంటకు కనీస ధర, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. మోపిదేవి మండలంలోని లంక గ్రామాలైన ఉత్తర చిరువోలులంక, కోసూరువారిపాలెం, మోపిదేవి, నాగాయితిప్ప, కొక్కిలిగడ్డ గ్రామాల్లో 950పైగా ఎకరాల్లో టమాట పంటను సాగు చేస్తున్నారు. లంక గ్రామాలకు ప్రతీ ఏడాది కృష్ణానదికి వరదలు, ప్రకృతి వైపరీత్యాలు రావడంతో వాణిజ్య, కూరగాయల పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో ఈ పంట కాలంలో అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుఫాను అనంతరం రైతులు టమాట, మిర్చి పంటను సాగు చేశారు. ఎకరాకు రూ.80 వేలు టమాట పంటకు పెట్టుబడి పెట్టగా, పంట చేతికి వచ్చింది. సమీపంలోని చల్లపల్లి, మచిలీపట్నం, గుడివాడ రైతు బజారులకు టమాట పంటను తరలిస్తుండగా, ఇతర ప్రాంతాల నుంచి కూడా పంట ఉత్పత్తులు వస్తుండటంతో కేజీ రూ.2 కూడా కొనుగోలు చేయటంలేదు. 30 కేజీల బాక్స్ టమాటలకు రూ.50 మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులకు కూలీ ఖర్చులు కూడా రావడంలేదు.
దిగుబడి ఉన్నా దీనస్థితి
ఏటా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. ఈ ఏడాది పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ధర మాత్రం కూలీ ఖర్చులకు కూడా రాక ఆర్థికంగా తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వందలాది ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. కనీసం కొనుగోలు చేస్తామని ఏ ఒక్కరూ కూడా ముందుకు రాకపోవటంతో పొలాల్లోనే పంటను వదిలివేశారు. కూలీల ఖర్చు కూడా రాకపోవటంతో కుటుంబసభ్యులే పంటను కోతకోసి మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసినా రెండు, మూడు రోజులుగా ఏ ఒక్కరూ రావటం లేదని వాపోతున్నారు. పొలాల గట్ల వద్దే టమాటలకు కాపలా కాయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. సమీపంలోని రైతు బజార్‌లకు ఈ ప్రాంతంలో పండించిన పంటలు దిగుమతి చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో దివిసీమ ప్రాంత రైతులు నష్టాల బాట పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా అయిన దివిసీమలో పండిన టమాట పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
ఎకరాకు 80 వేలు పెట్టుబడిగా పెట్టి టమాట పంటను సాగు చేశాం. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కేజీకి రూ.2 కూడా మద్దతు ధర రావటం లేదు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి.
- కోసూరు సుభాష్ చంద్రబోస్, కౌలు రైతు