వసూళ్లపై ఒత్తిడి!
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:27 AM
ఇంటి పన్నుల వసూలుపై పంచాయతీరాజ్ విభాగం ఉన్నతాధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులపై ఒత్తిడి పెంచారు. నూరుశాతం వసూళ్లు పూర్తి చేయాలని తరచూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన పలువురు ఉద్యోగులు అనారోగ్యంతో ఆస్పత్రులపాలవుతున్నారు.
-ఇంటి పన్నులపై పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల ప్రత్యేక దృష్టి
-నూరుశాతం వసూలు చేయాలని పంచాయతీలకు ఆదేశాలు
-మార్చి వరకు సమయమున్నా.. వెంటనే చేయాలని ఒత్తిడి
-వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి తరచూ హెచ్చరికలు
-ఒత్తిడిని తట్టుకోలేక అనారోగ్యం పాలవుతున్న గ్రామ కార్యదర్శులు
ఇంటి పన్నుల వసూలుపై పంచాయతీరాజ్ విభాగం ఉన్నతాధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులపై ఒత్తిడి పెంచారు. నూరుశాతం వసూళ్లు పూర్తి చేయాలని తరచూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన పలువురు ఉద్యోగులు అనారోగ్యంతో ఆస్పత్రులపాలవుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లాలోని 474 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరానికి సంబంధించి రూ.65.61 కోట్ల ఇంటి పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది సెప్టెంబరు నెల నుంచే ఇంటి పన్నుల వసూలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అప్పటి నుంచి ఇంటి పన్నుల వసూలులో వెనుకబడిన వారి జాబితాలను తయారు చేసి, ఎప్పటిలోగా నూరుశాతం వసూలు చేస్తారో చెప్పాలని హుకుం జారీ చేస్తూనే ఉన్నారు. మోపిదేవి పంచాయతీ రెగ్యులర్ కార్యదర్శిగా ఉన్న ఉద్యోగి, అదే మండలంలోని పెదకళ్లేపల్లి పంచాయతీకి ఇన్‌చార్జి కార్యదర్శిగా ఉన్నారు. ఇంటి పన్నులు వసూలు సక్రమంగా చేయలేదని, పరిపాలన సక్రమంగా నిర్వహించడం లేదనే కారణంతో ఈ కార్యదర్శిని గతేడాది సెప్టెంబరు నెలలో సస్పెండ్ చేశారు. ఇటీవల కంకిపాడులో ఇంటి పన్నుల వసూలు వేగవంతంపై అధికారులు సమావేశం నిర్వహించారు. పన్నులు వసూలు చేయకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
17న వీడియో కాన్ఫరెన్స్
జిల్లాలో ఇంటి పన్నుల వసూలులో వెనుకబడిన వారితో ఈ నెల 17వతేదీన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ఇంటి పన్నుల వసూళ్లలో వెనుకబడటానికి గల కారణాలపైనా ఈ సమావేశంలో సమీక్షిస్తామని ఈ నెల 10వ తేదీన పంచాయతీరాజ్ విభాగం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో డీపీవోతో పాటు డీఎల్‌పీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు., దీంతో ఈ తేదీ నాటికి ఇంటి పన్నుల వసూలులో వెనుబడిన వారిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారోననే అంశంపై పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 7వ తేదీన మొవ్వ పంచాయతీ కార్యదర్శి ఇంటి పన్నుల వసూలు నిమిత్తం వెళ్లగా, కట్టేందుకు కొంత సమయం ఇవ్వాలని ఒక సంస్థ ప్రతినిధులు కోరారు. దీంతో పన్నులు వసూలు చేయలేదనే కారణంతో అధికారులు తనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆందోళనతో గుండెపోటుకు గురై కుప్పకూలి పోయాడని, వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలిస్తే ఆరోగ్యం కుదుటపడిందని పంచాయతీ కార్యదర్శులు చెప్పుకుంటున్నారు. పంచాయతీ కార్యదర్శులపై తీవ్ర ఒత్తిడి ఉండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఒత్తిడిని తగ్గించాలని పలువురు పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.
మార్చి నెలాఖరు వరకు గడువు ఉన్నా..
ఇంటి పన్నులు, ఇతరత్రా పన్నుల వసూలు ఏటా నవంబరు నెలలో ప్రారంభించి, మార్చి నెలాఖరు నాటికి ముగించడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది మాత్రం సెప్టెంబరు నెలలోనే ఇంటి పన్నుల వసూలును పూర్తి చేయాలని టార్గెట్ పెట్టడం గమనార్హం. పంచాయతీల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరత్రా ప్రభుత్వ భవనాలకు సంబంధించి పన్నులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని, దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఇంటి పన్నులు చెల్లించడం లేదని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. ఇంటి పన్నుల వసూలు ఖాతాలో ఈ తరహా భవనాలు ఉన్నాయని, అయినా ఈ విషయం పక్కనపెట్టి నూరుశాతం పన్నులు వసూలు చేయాలని తమపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. ఇంటి పన్నుల వసూలు కోసం వెళితే మార్చి నెలాఖరు వరకు సమయం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు వచ్చారంటూ కొందరు తమపై గొడవలకు దిగుతున్నారని, వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియకుండా ఉందని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. ఒకవైపు స్వామిత్వ సర్వే పనితో పాటు వివిధ రకాల సర్వేలు చేసి వివరాలు పంపాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో రోజువారీ పరిపాలనపరమైన పనులు చేస్తూనే, ఇంటిపన్నులను వసూలు చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.