Share News

హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:18 AM

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్‌, చింతలపూడి పురుషోత్తం కుమార్‌ నియమితులయ్యారు.

హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు

  • రాష్ట్రపతి ఆమోదం.. నోటిఫికేషన్‌ జారీ

అమరావతి/న్యూఢిల్లీ, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్‌, చింతలపూడి పురుషోత్తం కుమార్‌ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీరు రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. ఆ తరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌ వీరితో ప్రమాణం చేయించనున్నారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29గా ఉంది. వీరి నియామకంతో ఈ సంఖ్య 32కు చేరనుంది. న్యాయాధికారుల కోటాలో పదోన్నతిపై గంధం సునీత, ఆలపాటి గిరిధర్‌, చింతలపూడి పురుషోత్తంకుమార్‌లను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది మే 4న కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.


క్రిమినల్‌ కేసుల అనుభవశాలి.. గిరిధర్‌

ఆలపాటి గిరిధర్‌ స్వగ్రామం ప్రకాశంజిల్లా, కొండేపి మండలం, గోగినేనివారి పాలెం. తండ్రి బాపయ్య చౌదరి స్వాతంత్ర సమరయోధుడు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు. గిరిధర్‌ ఒంగోలులోని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. ఒంగోలు జిల్లా కోర్టులో న్యాయవాదిగా తొమ్మిదేళ్లు ప్రాక్టీస్‌ చేశారు. ఉమ్మడి హైకోర్టులో మూడేళ్లు ప్రాక్టీస్‌ చేశారు. సివిల్‌, క్రిమినల్‌, వినియోగదారులు, సర్వీసు, రాజ్యాంగ సంబంధ కేసులలో మంచి అనుభవం గడించారు. మచిలీపట్నం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయాధికారిగా పనిచేశారు. విజయనగరం, కర్నూలు జిల్లాల ప్రధాన న్యాయాధికారిగా సేవలు అందించారు. హైకోర్టులో వివిధ హోదాల్లో రిజిస్ట్రార్‌గా పనిచేశారు. అనంతరం విశాఖపట్నం జిల్లా జడ్జిగా సేవలు అందించారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఏపీ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.


‘న్యాయ’ కుటుంబం నుంచి.. పురుషోత్తంకుమార్‌

విశ్రాంత జిల్లా జడ్జి సి. రాంబాబు, రమారత్నం దంపతులకు చింతలపూడి పురుసోత్తం కుమార్‌ విశాఖపట్నంలో జన్మించారు. వీరి కుటుంబం 3 తరాలుగా న్యాయవాదులు, న్యాయమూర్తులుగా సేవలు అందిస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మెరైన్‌ బయాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీలో పట్టా పొందారు. ఇన్‌టీరియర్‌ డెకరేషన్‌, డిజైనింగ్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, మీడియా చట్టాల్లో డిప్లొమో చేశారు. 2002లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని సీనియర్‌ న్యాయవాది ఎస్‌. రవి వద్ద ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2010లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. 2012లో రాజమహేంద్రవరం ఫ్యామిలీ కోర్టులో న్యాయాధికారిగా నాలుగున్నరేళ్లు పనిచేశారు. అనంతరం తిరుపతి అదనపు జిల్లా జడ్జిగా, 2019లో ప్రకాశంజిల్లా ప్రధాన న్యాయాధికారిగా సేవలు అందించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌గా రెండేళ్లు వివిధ హోదాల్లో పనిచేశారు. అనంతరం కడప, పశ్చిమ గోదావరి జిల్లా పీడీజేగా పనిచేశారు. 2025, జనవరి 25 నుండి ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు.


ఎల్‌ఎల్‌బీ పసిడి విజేత గంధం సునీత

కృష్ణాజిల్లా, పెదకళ్లేపల్లి గ్రామంలో 1977, జూన్‌ 14న గంధం వీరయ్య, శివ నాగేంద్రమ్మ దంపతులకు గంధం సునీత జన్మించారు. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. పదో తరగతి వరకు పెదకళ్లేపల్లిలోని ఎస్‌డీఎన్‌ఎ్‌సడీఎస్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. మచిలీపట్నం లేడీ యాంప్తిల్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌, అవనిగడ్డ వివేకానంద డిగ్రీ కళాశాల, విజయవాడ గాంధీజీ మహిళ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ముత్యాల నాగ మల్లేశ్వరరావును వివాహం చేసుకున్నారు. భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించారు. మాంటిస్సోరి కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. టాపర్‌గా నిలిచి బంగారు పతకం సాధించారు. 1999లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున యునివర్సిటీ నుంచి లేబర్‌ లాలో ఎల్‌ఎల్‌ఎమ్‌ పూర్తి చేశారు. 2000-2008 వరకు బెజవాడ బార్‌లో అసోసియేషన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా గుడివాడలో 2008-2010 వరకు సేవలు అందించారు. ఆ తర్వాత 2010లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. విశాఖపట్నం సీబీఐ కోర్టు జడ్జిగా, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రధాన న్యాయాధికారిగా విధులు నిర్వర్తించారు. 2019-23 వరకు హైకోర్టులో వివిధ హోదాల్లో రిజిస్ట్రార్‌గా పనిచేశారు. 2023 నుంచి తూర్పుగోదావరిజిల్లా ప్రధాన న్యాయాధికారిగా రాజమహేంద్రవరంలో సేవలు అందిస్తున్నారు.

Updated Date - Jul 04 , 2026 | 04:21 AM