Share News

దార్శనిక నేత చంద్రబాబు

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:48 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత కలిగిన నాయకుడు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఆయన తన దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్‌ను, అమరావతిని అద్భుతంగా అభివృద్థి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

దార్శనిక నేత చంద్రబాబు

  • రైతుల త్యాగ ఫలితమే అమరావతి

  • పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా నిలిచిపోతుంది

  • మంత్రి లోకేశ్‌, ఎంపీలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  • అమరావతిని అజరామరం చేశారంటూ లోకేశ్‌ కృతజ్ఞతలు

‘‘అమరావతి పేరులోనే గొప్పతనం ఉంది. రైతులు పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా నిలిచిపోతుంది. అమరావతికి రాజధాని హోదా కల్పించే చట్టం నా హయాంలో రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉంది. దార్శనిక నేత చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని మంచి అభివృద్ధిని సాధిస్తుంది.’’

- రాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత కలిగిన నాయకుడు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఆయన తన దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్‌ను, అమరావతిని అద్భుతంగా అభివృద్థి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములను మాత్రమే ఇవ్వలేదని, తమ హృదయాలను కూడా ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. అమరావతి పేరులోనే గొప్పతనం ఉందని, రైతులు పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అమరావతికి రాజధాని హోదా కల్పించే చట్టం తన హయాంలో రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. అమరావతికి రాజధాని హోదా కల్పించే చట్టానికి గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలిపేందుకు మంత్రి నారా లోకేశ్‌ నేతృత్వంలో కూటమి ఎంపీలు రాష్ట్రపతి భవన్‌లో ఆమెతో భేటీ అయ్యారు. ‘‘మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌- మా రాజధాని అమరావతి’’ అంటూ ఆంధ్రజాతి సగర్వంగా తల ఎత్తి చెప్పుకొనేలా రాజధాని చట్టంపై సంతకం చేశారంటూ రాష్ట్రపతికి లోకేశ్‌, కూటమి ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు. ‘‘రాష్ట్ర విభజనతో కోలుకోలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఈ విషయం గుర్తించి.. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ చట్టం చేశారు’’ అంటూ రాష్ట్రపతికి రాష్ట్రం తరపున లోకేశ్‌ ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.

Untitled-2 copy.jpg


ఆంధ్రప్రదేశ్‌ అభివృద్థి పథంలో పయనించాలని, రాజధాని పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారు. అమరావతికి శంకుస్థాపన చేసిందీ, 2024లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి పనులు పున:ప్రారంభించిందీ ప్రధాని మోదీయేనని ఆమెకు లోకేశ్‌ తెలిపారు. రాజధాని అమరావతి చట్టానికి ఆమోదముద్ర వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు బలమైన పునాది వేశారని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కొనియాడారు. అనంతరం అమరావతి చరిత్ర, సంస్కృతి, రాజధాని నిర్మాణాలు, రైతుల ఉద్యమం, మాస్టర్‌ ప్లాన్‌ను ఊహా చిత్రాలు, పర్యావరణ హిత నిర్మాణ విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ముర్ముకులోకేశ్‌ అందజేశారు.

Updated Date - Apr 14 , 2026 | 06:33 AM