Share News

డిగ్రీతో చదువుముగిసిపోకూడదు

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:05 AM

వేగంగా మారుతున్న ప్రపంచంలో డిగ్రీ సంపాదించడంతో చదువు ముగిసిపోకూడదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. భవిష్యత్తులోనూ ..

డిగ్రీతో చదువుముగిసిపోకూడదు

  • భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి

  • కొత్త జ్ఞ్ఞానాన్ని సంపాదించే ధైర్యాన్ని పెంచుకోండి

  • కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము

  • 56 మందికి బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు ప్రదానం

  • హాజరైన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, మంత్రి లోకేశ్‌

అనంతపురం, జూలై 1(ఆంధ్రజ్యోతి): వేగంగా మారుతున్న ప్రపంచంలో డిగ్రీ సంపాదించడంతో చదువు ముగిసిపోకూడదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు సమీపంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ప్రథమ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ... అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపన ఉండాలని, అది ఎంతో బలాన్ని ఇస్తుందని చెప్పారు. కొత్త ఆలోచనలను అన్వేషించడానికి, కొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. డిగ్రీ పట్టాలు సాధించడం వెనుక విద్యార్థుల కఠోర శ్రమ ఉన్నా, దాని వెనుక వారి తల్లిదండ్రుల త్యాగాలు, గురువుల మార్గదర్శనం, సమాజ మద్దతు ఉన్నాయన్నారు. అందుకే పట్టభద్రులైన విద్యార్థులకు సామాజిక సేవ చేయాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక రోజు కాదు. ఈ యువ సంస్థ ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక మైలురాయి’ అని ఆమె పేర్కొన్నారు. యువత ఏ మార్గాన్ని ఎంచుకున్నా, అంకితభావంతో, నిజాయతీతో ముందుకు సాగాలని ముర్ము సూచించారు. ఈ సందర్భంగా 56 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు.

నూతన అధ్యాయానికి నాంది: గవర్నర్‌

అనంతపురంలో కేంద్రీయ వర్సిటీ స్థాపన రాష్ట్ర ఉన్నత విద్యారంగంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. సామాజిక, సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా వినూత్న విద్యా కార్యక్రమాలను రూపొందిస్తూ, రానున్న కాలంలో ఈ విశ్వవిద్యాలయం వేగవంతమైన అభివృద్ధిని సాధించగలది విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు మీ విద్యా జీవితానికి ముగింపు కాదు. ఇది మీ జీవిత ప్రయాణంలో ఒక నూతన అధ్యాయానికి ఆరంభం మాత్రమే. నేర్చుకోవడం ఎన్నటికీ ఆపవద్దు. మీ కలలను సాకారం చేసుకునే ప్రయత్నంలో వెనుకడుగు వేయవద్దు’ అని విద్యార్థులకు సూచించారు.


స్వర్ణాంధ్ర-2047 దిశగా బాబు అడుగులు: లోకేశ్‌

జాతీయ విద్యా విధానం, డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, వికసిత్‌ భారత్‌-2047 దార్శనికత ద్వారా ప్రధాని మోదీ నాయకత్వంలో విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మితమవుతోందని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఆయన స్ఫూర్తితో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర-2047 దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. విద్య, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించగల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ‘ఇది మీ సమయం. ఇది మీకు లభించిన గొప్ప అవకాశం. మీ నేపథ్యం మీ భవిష్యత్తును నిర్ణయించేలా ఎప్పుడూ అనుమతించవద్దు. మీ కలలు, కఠోర శ్రమ, వ్యక్తిత్వం... ఇవే మీరు ఎవరన్నది నిర్వచించేలా చూసుకోవాలి’ అని ఆయన విద్యార్థులకు సూచించారు. ‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఇక్కడ కూర్చునే భాగ్యం మనకు దక్కింది. ఆమె జీవితం తరగతి గదిలో నేర్వలేని ఒక పాఠం. ఆమె ఒక చిన్న గిరిజన గ్రామంలో జన్మించారు. చాలామందిలాగే కుంగదీసే వ్యక్తిగత విషాదాలను ఎదుర్కొన్నారు. అయినా ఎన్నడూ విశ్వాసం కోల్పోలేదు. సేవ చేయడం ఆపలేదు. ఉపాధ్యాయినిగా, శాసనసభ్యురాలిగా, గవర్నర్‌గా.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిగా మన ముందున్నారు’ అని లోకేశ్‌ అన్నారు. ప్రతి స్నాతకోత్సవం ప్రత్యేకమైనదేనని, కానీ ప్రథమ స్నాతకోత్సవం చరిత్రాత్మకమైనదని చెప్పారు.

మాన్యుఫ్యాక్చరింగ్‌, టెక్నాలజీ గమ్యస్థానంగా ఏపీ

ప్రపంచం మునుపెన్నడూ లేనంత వేగంగా మారుతోందని మంత్రి లోకేశ్‌ అన్నారు. కొత్త టెక్నాలజీ రూపాంతరం చెందుతూనే ఉంటుందని తెలిపారు. నిరంతరం నేర్చుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ, మార్పునకు నాయకత్వం వహించే ధైర్యవంతులదే భవిష్యత్తు అని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు చైతన్యవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, టెక్నాలజీ రంగాలకు గమ్యస్థానంగా మారుతోందని చెప్పారు. నేటి ప్రపంచానికి అవకాశాల కోసం ఎదురుచూసేవారు అవసరం లేదని, అవకాశాలను సృష్టించేవారు కావాలని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఏపీలో విద్యా సంస్కరణలు భేష్‌!

  • లోకేశ్‌ను అభినందించిన రాష్ట్రపతి

రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు చాలా బాగున్నాయని మంత్రి లోకేశ్‌ను రాష్ట్రపతి ముర్ము అభినందించారు. వీటిని కొనసాగించాలని సూచించారు. స్నాతకోత్సవం ముగిసిన అనంతరం రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు మంత్రి లోకేశ్‌ హెలికాప్టర్‌ వరకూ వెళ్లారు. ఆ సందర్భంలో లోకేశ్‌ను ముర్ము తనవద్దకు పిలిచి మాట్లాడారు. విద్యా వ్యవస్థలో మార్పులు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మార్గం వేస్తాయని చెప్పారు. స్నాతకోత్సవంలో లోకేశ్‌ ప్రసంగం స్ఫూర్తిమంతంగా సాగిందని అభినందించారు. కాగా, కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ముర్ముకి లోకేశ్‌ ధర్మవరం చేనేత చీరను బహూకరించారు.

Updated Date - Jul 02 , 2026 | 03:05 AM