మెరుగైన భవితకు సంకల్పం
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:20 AM
స్నాతకోత్సవం అంటే ఒక సంబరం, ప్రత్యేక సందర్భం మాత్రమే కాదని, భవిష్యత్తును నిర్దేశించుకునేందుకు ఒక సంకల్పం తీసుకునే క్షణమనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని..
ప్రపంచంతో పోటీ పడాలంటే నైపుణ్యాలు అవసరం
దేశంలోని విశ్వవిద్యాలయాలపై విస్తృత బాధ్యతలు
ప్రజల జీవనోపాధి మెరుగుదలకు అవి దోహదం
గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కృషి చేయాలి
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
విద్యార్థులకు పతకాలు, పట్టాలు ప్రదానం
ఏపీకి విజన్ కలిగిన సీఎం చంద్రబాబు, పట్టుదలగా పనిచేసే మంత్రి లోకేశ్ ఉన్నారు
కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంస
విశాఖపట్నం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): స్నాతకోత్సవం అంటే ఒక సంబరం, ప్రత్యేక సందర్భం మాత్రమే కాదని, భవిష్యత్తును నిర్దేశించుకునేందుకు ఒక సంకల్పం తీసుకునే క్షణమనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి.. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో తగిన నైపుణ్యం సాధించాలని సూచించారు. పుస్తక జ్ఞానానికి అతీతంగా పర్యావరణ వ్యవస్థ నుంచి ఆచరణాత్మక అంశాలు ఆకళింపు చేసుకోవాలన్నారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. దేశంలోని విశ్వవిద్యాలయాలపై విస్తృత బాధ్యతలు ఉన్నాయని, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు అవి దోహదపడాలన్నారు. గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు యూనివర్సిటీ ప్రయత్నించాలని సూచించారు. గిరిజనులకు సంస్కృతి, సంప్రదాయం ముఖ్యమని, వాటిని సమ్మిళితం చేస్తూనే అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.
గిరిజన యువత అభివృద్ధికి కృషి
సామాజిక న్యాయం కోసం స్థాపితమైన గిరిజన విశ్వవిద్యాలయం ఆయా వర్గాల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉందని, గిరిజన యువత సంపూర్ణ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. ఏజెన్సీలో లభించే అటవీ ఉత్పత్తులు, చిరుధాన్యాలు, ఔషధ మొక్కలు ద్వారా ఉత్పాదకత పెంచడానికి వినూత్న వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్నారు.పర్యావరణ పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ గిరిజన విశ్వవిద్యాలయం ఉత్తరాంధ్రలోని గిరిజనుల వికాసానికి ‘సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్’ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదొక్కటే కాకుండా గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, పౌష్టికాహారం వంటి అంశాల్లోను పనిచేస్తోందన్నారు. ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న దేశంలో గిరిజనులు కీలకపాత్ర పోషించడానికి సమాన అవకాశాలు కల్పిస్తాయని ఆకాంక్షించారు. యువత పర్యావరణ పరిరక్షణపై దృష్టిసారించేలా, అర్థవంతమైన, ఆచరణాత్మకమైన బోధన పద్ధతులు అవలంబించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించడంలో ఈ గిరిజన విశ్వవిద్యాలయం కీలకపాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి ముందు వివిధ అంశాల్లో ప్రతిభ చూపి, ప్రథమ స్థానంలో నిలిచిన పలువురు విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు ప్రదానం చేసి, పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రులు లోకేశ్, సంధ్యారాణి, యూనివర్సిటీ చాన్స్‌లర్ మదన్‌లాల్ మీనా, వైస్ చాన్స్‌లర్ టి. శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యలో అవకాశాలు: గవర్నర్
గిరిజనులకు ఉన్నత విద్యలో సమాన అవకాశా లు కల్పిస్తూ, బహు భాషా విధానం అమలు చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ సూచించారు. స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకే అర్థమయ్యే సాంస్కృతిక భాషతో పాటు ఇతర భాషల్లో నూ విద్యాబోధన జరగాలన్నారు. విజయనగరంలోని గిరిజన విశ్వవిద్యాలయం ఈ జిల్లాలతో పాటు దక్షి ణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ లకు కూడా సేవలు అం దిస్తోందన్నారు. ఏపీ జనాభాలో గిరిజనులు 27.39 లక్షల మంది ఉన్నారని, వీరిలో 34 తెగలు ఉండగా, అందులో 7 తెగలు బాగా వెనుకబడి ఉన్నాయన్నా రు. అరకు లోయ ప్రాంతంలో గిరిజనులు పండించే ఆర్గానిక్ కాఫీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దాని ద్వారా 40 వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. గిరిజన అక్షరాస్యత (58.95 శాతం) జాతీయ అక్షరాస్యత కంటే తక్కువగా ఉందన్నారు.
నేడు అనంతపురం జిల్లాకు రాష్ట్రపతి
అనంతపురం జూన్ 30(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం బుధవారం జరగనుంది. బుక్కరాయసముద్రం మండలంలోని యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము హాజరుకానున్నారు. చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేశ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
13 మందికి బంగారు పతకాలు
స్నాతకోత్సవ కార్యక్రమంలో గిరిజన యూ నివర్సిటీకి చెందిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి ముర్ము బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేశారు. వీరంతా 2019 నుంచి 2025 వరకు పలు సబ్జెక్టుల్లో టాపర్లుగా నిలిచారు. గోల్డ్ మెడల్స్ అందుకున్న వారిలో యాగతి స్వాతిచంద్రిక(ఎంఎ్‌ససీ- కెమిస్ట్రీ), కాకినాడ లావణ్య(ఎంఎస్‌సీ- కెమిస్ట్రీ), గినోప్రగతీశ్ (ఎంఎస్‌సీ- కెమిస్ట్రీ), నరిసిపురం కావ్య(ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌సీ-కెమిస్ట్రీ), ఉమ్మిడి ఈషిత(ఇంటిగ్రేటెడ్ ఎంఎ్‌ససీ-కెమిస్ట్రీ), సరస్వతి ఆర్(ఎం ఎస్‌సీ-కెమిస్ట్రీ), జొన్నలగడ్డ దివ్య(ఎంబీఏ), ఫైజల్ బాబు సీకే(మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్), కె.లావణ్య(ఎంఎస్‌సీ-బయోకెమిస్ట్రీ), రేగం నీలిమ(ఎంఎస్‌సీ- కెమిస్ట్రీ), ఎంధవ సింధుప్రియ(ఎంఎస్‌సీ-బయోటెక్నాలజీ), మరిశర్ల విజయలక్ష్మి (ఎంబీఏ), స్నేహ కె (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) ఉన్నారు.
మీరే ఉద్యోగాలు సృష్టించండి.. యువతకు కేంద్ర మంత్రి ప్రధాన్ పిలుపు
వర్సిటీ నుంచి పట్టాలు పుచ్చుకున్నా ఉద్యోగాలకు వెళ్లవద్దని, మీరే ఉద్యోగాలు సృష్టించేలా ప్రయత్నాలు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు సూచించారు. స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. విశాఖపట్నం త్వరలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారబోతోందని, అందులో లబ్ధిదారులు మీరే అంటూ యువతను ఉత్సాహపరిచారు. ఆంగ్లేయులను ఎదురించిన అల్లూరి సీతారామరాజు జన్మించిన ప్రాంతానికి చెందిన ఇక్కడి యువత అదే పోరాట పటిమ చూపాలని ఆకాంక్షించారు. ఏపీకి విజన్ కలిగిన సీఎం చంద్రబాబు, పట్టుదలగా పనిచేసే విద్యా శాఖ మంత్రి లోకేశ్‌లు ఉన్నారని, ఇక్కడ పరిశోధనలకు అనువైన వాతావరణం అభివృద్ధి చెందుతుందన్నారు.