Share News

AP CM Chandrababu Naidu: తెలుగుజాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:55 AM

‘తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరం కాపాడుకోవాలి. సంస్కృతి, సాహిత్యం, సినిమా.. తెలుగు ప్రజల బలం. సృజనాత్మకతకు తెలుగు సినిమా చిరునామా.

AP CM Chandrababu Naidu: తెలుగుజాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి

  • సంస్కృతి, సాహిత్యం, సినిమా తెలుగు ప్రజల బలం

  • ఆవకాయ్‌-ఫెస్టివల్‌లో సీఎం చంద్రబాబు

  • విజయవాడ పున్నమిఘాట్‌లో ఘనంగా ప్రారంభం

విజయవాడ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరం కాపాడుకోవాలి. సంస్కృతి, సాహిత్యం, సినిమా.. తెలుగు ప్రజల బలం. సృజనాత్మకతకు తెలుగు సినిమా చిరునామా. భక్తప్రహ్లాద నుంచి బాహుబలి వరకు మన భాష, సంస్కృతి, సృజనాత ్మకతలు ప్రపంచ వ్యాప్తం అయ్యాయి. తెలుగు సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లడం కోసమే ఆవకాయ్‌-అమరావతి ఫెస్టివల్‌ నిర్వహించటానికి కారణం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం విజయవాడ భవానీపురంలోని పున్నమిఘాట్‌లో ఆవకాయ్‌-అమరావతి ఫెస్టివల్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలుగు జాతి ఎక్కడున్నా నంబర్‌ వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. ఆవకాయ్‌ అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్‌ అని, ఆవకాయ్‌ మన సంప్రదాయం, సాంస్కృతిక వైభవమని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలను చాటే కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, రానున్న రోజుల్లో మూడు రోజులు పాటు ఆవకాయ్‌-అమరావతి వేడుకలు ప్రభుత్వ పరంగా జరుపుదామన్నారు. ఆహారం అంటే ప్రపంచానికి గుర్తుకు వచ్చేది భారత్‌ అయితే, మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌ అని అన్నారు. రాబోయే రోజులలో ప్రపంచానికే ఏపీ ఆతిథ్యం ఇచ్చే స్థితికి వస్తుందన్నారు. 2019-24 మధ్యలో పండుగలు లేవని, ప్రజలు నవ్వడం మర్చిపోయారని అంటూ వైసీపీ పాలనపై సెటైర్లు వేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘‘ముఖ్యమంత్రిగా ఉండగా మూడు పుష్కరాలు రావడం నా అదృష్టం. మొదటి పుష్కరాలు ఉమ్మడి ఏపీలో చేశాం. రెండో పుష్కరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేశాం. మూడోసారి గోదావరి పుష్కరాలు 2027లో, కృష్ణా పుష్కరాలు 2028లో నిర్వహిస్తాం. సాహిత్యం మన వారసత్వ సంపద. నన్నయ్య, తిక్కన, ఎర్రన్న, పోతన, అన్నమయ్య వంటి వారి వారసులం. గురజాడ, శ్రీశ్రీ వంటి వారి రచనలు సమాజంలో మార్పు తేవటానికి కృషి చేశాయి.


ప్రపంచ టెక్నాలజీని ఏపీకి తెస్తా

ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం. నాలెడ్జ్‌ ఎకానమీ మనకు బ్యాక్‌బోన్‌. ప్రపంచంలో ఉన్న టెక్నాలజీని ఇక్కడకు తెస్తా. దానిని ఉపయోగించుకొని అభివృద్ధికిలోకి రావాలి. రాబోయే రోజుల్లో స్పేస్‌ సిటీగా తిరుపతి, డ్రోన్‌ సిటిగా ఓర్వకల్లు ఉంటాయి. ఎలక్ర్టానిక్స్‌కు ఏపీ చిరునామాగా మారుతుంది. ఉద్యోగాలు కల్పించేందుకు టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రపంచం అంతా సూర్యలంక బీచ్‌ గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. సంక్రాంతి లాంటి పండుగలను గ్రామాలకు వెళ్లి అందరితో కలిసి ఉత్సహంగా జరుపుకోవాలి. ఇరవై ఏళ్ల క్రితం నుంచి సంక్రాంతికి మా కుటుంబం నారావారిపల్లెకు వెళతాం. అంతా కలిసి పండగ చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ జన్మభూమితో అనుసందానం అవ్వాలి. అమరావతి ప్రపంచంలోనే బెస్ట్‌ సిటీగా ఉంటుంది. టూరిజం బాగా జరగాలంటే శుభ్రత, భద్రత ఉండాలి’’ అని చెప్పారు.

అమరావతి గురించి ఎవరూ భయపడక్కర్లేదు

అమరావతి భవిష్య నగరమని, ఎవరూ కూడా భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. అమరావతిపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పరోక్షంగా చంద్రబాబు స్పందించారు. అమరావతి, గుంటూరు, విజయవాడ, మంగళగిరి నాలుగు నగరాలు కలిసి ఫ్యూచర్‌సిటీగా మారుతుందన్నారు ప్రపంచస్థాయిలో రోడ్లు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వపాలనా భవనాలన్నింటినీ నిర్మిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో అద్భుతంగా ఉంటుందన్నారు.


  • ప్రపంచ సృజనాత్మక రాజధానిగా ఏపీ

  • ఆవకాయ్‌ ఫెస్టివల్‌లో మంత్రి దుర్గేష్‌

రాష్ట్రంలో ఉన్న ప్రతి నదికీ ఒక కథ, ప్రతి కళకూ ఒక ఆత్మ ఉందని.. ఏపీని ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ పిలుపు నిచ్చారు. పవిత్ర కృష్ణానది తీరాన నిర్వహిస్తున్న ‘ఆవకాయ్‌ అమరావతి ఫెస్టివల్‌’ ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వైభవానికి కళా, సాహిత్య, సినిమా, పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రం పర్యాటకాభివృద్ధితో ఆరెంజ్‌ రివల్యూషన్‌గా మారుతోందన్నారు. గురువారం విజయవాడలో జరిగిన ఆవకాయ్‌ అమరావతి ఉత్సవాల ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, కనుమరుగవుతున్న కళలు, సాహిత్యం, సినిమా, జానపద సంప్రదాయాలకు పునరుజ్జీవం కల్పించడమే ఈ ఫెస్టివ ల్‌ ప్రధాన ఉద్దేశమన్నారు. తెలుగు వారి ప్రతి ఇంటికీ ‘ఆవకాయ్‌’తో విడదీయలేని బంధం ఎలా ఉందో.. ఈ ఉత్సవం కూడా సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకం, కళా ప్రదర్శన సమ్మేళనంగా అంతటి ఆత్మీయతను పంచుతుందని వివరించారు. కథలు, సినిమాలు, డిజిటల్‌ కళలే పెట్టుబడిగా ఉపాధిని సృష్టించడాన్ని ఆయన ‘ఆరెంజ్‌ రెవల్యూషన్‌’గా అభివర్ణించారు. భారతదేశానికే ఏపీ కోహినూర్‌ వజ్రం లాంటిదన్నారు.


ఏపీ సంస్కృతీ సంప్రదాయాలు భేష్‌

‘యూరోపియన్‌’ రాయబారి హెర్వే డెల్ఫీ

సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనానికి ఆంధ్రప్రదేశ్‌ నిదర్శనమని యూరోపియన్‌ యూనియన్‌ రాయబారి హెర్వే డెల్ఫీ అన్నారు. అవకాయ్‌-అమరావతి ఫెస్టివల్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న డెల్ఫీ మాట్లాడుతూ కూచిపూడి, కలంకారి, కొండపల్లి బొమ్మలు ప్రపంచాన్ని ఎప్పుడో ఆకర్షించాయని చెప్పారు. రక్షణ రంగంలోనూ కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

సీఎంను కలిసిన దౌత్యవేత్త

అమరావతి: భారతదేశంలో యూరోపియన్‌ యూనియన్‌ దౌత్యవేత్త హెర్వే డెల్ఫిన్‌ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం రాత్రి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో యూరోపియన్‌ యూనియన్‌తో ఏపీ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇరువురూ చర్చించారు.

Untitled-5 copy.jpg

Updated Date - Jan 09 , 2026 | 05:59 AM