ఎడారి బతుకులో అనురాగం ఎండమావి!
ABN , Publish Date - May 25 , 2026 | 05:02 AM
కట్టుకున్న వాడు కాలం చేశాడు.. కన్నవారంటూ ఎవరూ లేకపోవడంతో సుదీర్ఘ కాలంగా పరాయి దేశంలో పాచి పనులు చేస్తూ పొట్టపోసుకున్న ఆమె.. తాను సంపాదించింది..
రోడ్డు ప్రమాదం.. ఆపై పక్షవాతంతో బతుకు ఛిద్రం
సాయం పొందిన బంధువులు ముఖం చాటేశారు
మానవత్వంతో ఆదుకున్న ప్రవాసీ లీగల్ సెల్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
కట్టుకున్న వాడు కాలం చేశాడు.. కన్నవారంటూ ఎవరూ లేకపోవడంతో సుదీర్ఘ కాలంగా పరాయి దేశంలో పాచి పనులు చేస్తూ పొట్టపోసుకున్న ఆమె.. తాను సంపాదించింది.. నిరంతరాయంగా బంధువులకు పంపించి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంది. కానీ.. చివరికి విధి వక్రించి.. అచేతనంగా మాతృభూమికి తిరిగొస్తే.. ఒక్కరు కూడా ఆమెను ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో విమానాశ్రయం నుంచి నేరుగా అనాథ ఆశ్రమానికి చేరుకోవాల్సి వచ్చింది! ఇదీ.. శ్రీ అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లికి చెందిన దళిత మహిళ తుమ్మలూరు సుబ్బలక్ష్మమ్మ(55) దీనగాథ.
రోడ్డు ప్రమాదంతో బతుకు ఛిద్రం!
దశాబ్ద కాలంగా బహ్రెయిన్‌లో పనిచేస్తున్న సుబ్బలక్ష్మమ్మ గతేడాది అక్టోబరులో రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. తర్వాత పక్షవాతానికి గురయ్యారు. స్వదేశానికి తిరిగొస్తే.. ఆమె ఆలనాపాలన చూడాల్సి వస్తుందని బంధువులు ముఖం చాటేశారు. చికిత్స పూర్తయింది. డిశ్చార్జి అయి ఇంట్లో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినా ఆమెకంటూ ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రి మంచానికే పరిమితమైంది. ఆమె దీన స్థితి బహ్రెయిన్‌లోని సామాజిక సంస్థ ప్రవాసీ లీగల్ సెల్‌కు తెలియగా.. ఈ సంస్థకు చెందిన గంగాధర్ రావు, సుధీర్ తిరునిలాత్... కడప జిల్లా ప్రవాసీ ప్రముఖుడు ఓర్సు నాగరాజును సంప్రదించారు. కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమెను నాగరాజు, గంగాధర్ బృందం సేవలు చేస్తూ.. కూర్చోబెట్టే స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కడప జిల్లా ఎర్రగుంట్ల మండలానికి తీసుకొచ్చి ఎద్దుల పెద్ద శేషమ్మ ఫౌండేషన్ ఆశ్రమంలో శనివారం చేర్పించారు. అవసరమైన వైద్య ఖర్చులు కూడా భరిస్తామని నాగరాజు ఒప్పుకొన్నారు. చెన్నై నుంచి ఆశ్రమం వరకు ఆమెను చేర్చడానికి ఏపీఎన్నార్టీ సంస్థ అంబులెన్సు సమకూర్చింది.